- సిట్లో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి
- సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం
- లడ్డూ వివాదం రాజకీయ డ్రామాగా మారొద్దని కోర్టు వ్యాఖ్య
- ఐదుగురు సభ్యులతో ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, వెలుగు: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందులో ఇద్దరు సీబీఐ, ఇద్దరు ఏపీ పోలీసు అధికారులు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) నుంచి ఒక అధికారి ఉండాలని సూచించింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ రద్దవుతుందని స్పష్టం చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. కీలక కామెంట్లు చేసింది.
తిరుమల లడ్డూ అంశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినదని గుర్తు చేసింది. ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని కామెంట్ చేసింది. ‘‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల్లోకి వెళ్లడం లేదు. కోర్టును రాజకీయ యుద్ధ భూమిగా ఉపయోగించుకోవడానికి అనుమతించం. కోట్లాది మంది భక్తుల అనుమానాలను నివృత్తి చేయడానికే స్వతంత్ర సిట్ ఏర్పాటు చేశాం” అని తెలిపింది.
ఇవీ వాదనలు..
తొలుత కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై ఎలాంటి సందేహాలు లేవు. కావాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఒకరిని అందులో చేర్చవచ్చు. కేంద్రం నుంచి సీనియర్ అధికారి పర్యవేక్షణ ఉంటే, దర్యాప్తుపై భక్తుల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది’’ అని అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ.. ‘‘మేం సిట్‌తో విచారణ చేయించాలని అనుకుంటున్నాం. అందులో మీకు నచ్చిన అధికారిని చేర్చవచ్చు. ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసింది’’ అని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాదనలపై పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ అభ్యంతరం తెలిపారు.
‘‘లడ్డూ వివాదంపై గురువారం కూడా ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్లు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే” అని కోరారు. కాగా, జులై 4 వరకు వచ్చిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షించలేదని.. జులై 6, 12 తేదీల్లో వచ్చినవి మాత్రమే పరీక్షించామని, వాటిల్లో కల్తీ జరిగినట్టు తేలిందని టీటీడీ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు.