- ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించే రహదారులపై 20 చెక్ పోస్టులు
- శాఖల మధ్య సమన్వయ లోపం.. రాత్రి వేళల్లో సరిహద్దులు దాటి వస్తున్న లారీలు
- ఇటీవల ముదిగొండ, నేలకొండపల్లిలో 41 లారీల పట్టివేత
- కిందిస్థాయి సిబ్బందిని మామూళ్లతో మేనేజ్ చేస్తున్న వ్యాపారులు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో ఏపీ నుంచి అక్రమంగా ధాన్యం తరలివస్తోంది. ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా పెద్ద సంఖ్యలోనే లారీల్లో ధాన్యాన్ని తీసుకువచ్చి, ఇక్కడి కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. వారం రోజుల కింద ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్టు మీదుగా జిల్లాలోకి వచ్చిన 31 లారీలను, నేలకొండపల్లి మండలం అప్పల నర్సింహాపురం మీదుగా జిల్లాలోకి వచ్చిన 10 లారీలను చెరువుమాదారం దగ్గర గ్రామస్తులు అడ్డుకున్నారు.
ఈ రెండు ఘటనల్లో లారీలను చెక్ పోస్టుల దగ్గర అధికారులు గానీ, సిబ్బంది గానీ అడ్డుకోకపోవడం గమనార్హం. అంతకుముందు 60కి పైగా లారీలకు మార్కెట్ సెస్ కట్టించుకొని అనుమతించినట్టుగా కొందరు లారీ డ్రైవర్ల దగ్గర రశీదులు ఉన్నాయి. పోలీసులు కూడా రూ.3వేల చొప్పున జరిమానా విధించి లారీలను వదిలేశారు. అయితే వ్యవసాయ మార్కెట్ చెక్ పోస్టుల్లో లారీకి రూ.వెయ్యి చొప్పున మామూళ్లు వసూలు చేస్తూ, లారీలను చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
శాఖల మధ్య సమన్వయం లేక..
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి ఏపీ నుంచి ధాన్యం రావచ్చని ముందుగానే అంచనా వేశారు. ఏపీ నుంచి జిల్లాలోకి ప్రవేశించే 20 రహదారులను గుర్తించి, వాటిపై చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. వాటి దగ్గర సీసీ కెమెరాలను కూడా పెట్టారు. అంతకుముందే పోలీస్, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్, రెవెన్యూ శాఖ అధికారులతో సమన్వయ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఏపీ నుంచి రాష్ట్రానికి ధాన్యం రాకుండా నిషేధం విధించారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. చెక్ పోస్టుల దగ్గర పట్టుకున్న లారీలకు మార్కెటింగ్ శాఖ అధికారులు ఒక శాతం మార్కెట్ ఫీజ్ వసూలు చేసి అనుమతిస్తుండగా, పోలీసులు ఓవర్ లోడ్ ఉంటే గుర్తించి పెనాల్టీ విధిస్తున్నారు.
Also Read :- రూ.20 వేల కోట్లు నీళ్లపాలు.!
ఏపీలోని గుంటూరు నుంచి మిర్యాలగూడకు రైతులే ధాన్యాన్ని తరలిస్తున్నట్టుగా పేపర్లు చూపిస్తూ దందా నడిపిస్తున్నారు. ఇటీవల పట్టుకున్న లారీలను సివిల్ సప్లయ్ అధికారులు వెనక్కి తిప్పి పంపినట్టు చెబుతున్నా, అవి మరో మార్గంలో అయినా అనుకున్న ప్లేస్ లో అన్‌లోడు చేయడం పక్కా అనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో వాహనాలను తిప్పి పంపించకుండా, లారీని సీజ్ చేయడం గానీ, పెద్ద మొత్తంలో జరిమానా విధించడం గానీ చేసి ఉంటే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
20 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం
ఏపీ నుంచి ఇటీవల జిల్లాలోకి ధాన్యం లోడ్‌తో వచ్చిన లారీలను తిప్పి పంపించాం. వారి దగ్గర రైతులే ధాన్యాన్ని తీసుకువస్తున్నట్టుగా రశీదులు ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్ల ప్రారంభానికి ముందే పోలీస్, అగ్రికల్చర్, మార్కెటింగ్, రెవెన్యూ ఆఫీసర్లతో సమన్వయ సమావేశాలు జరిగాయి. జిల్లాలోకి వచ్చే రహదారులపై 20 చెక్ పోస్టులను ఏర్పాటుచేశాం. ప్రతీ చెక్ పోస్టు దగ్గర సీసీ కెమెరాలున్నాయి. ఏపీ ధాన్యం జిల్లాలోకి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- చందన్ కుమార్, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి, ఖమ్మం