
- అధికారులు ఫిర్యాదు చేస్తే బోర్డు పరిధి చెప్పి దాటవేత
- క్యారీ ఓవర్ వాటర్పైనా తేల్చకుండా ట్రిబ్యునల్పైకి నెట్టేస్తున్న బోర్డు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా ప్రాజెక్టుల్లో ఏపీ యథేచ్ఛగా జల దోపిడీ చేస్తున్నా కనదు! దానిపై అధికారులు ఫిర్యాదు చేసినా వినదు!! మీటింగుల్లో ఏపీపై పల్లెత్తు మాటా అనదు!!! ప్రస్తుతం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) తీరు ఇలాగే ఉంది. ఏపీ తన కోటాకు మించి నీటిని తరలించుకుపోతున్నా ఏమీ జరగనట్టే కృష్ణా బోర్డు చోద్యం చూస్తూ ఉండిపోతున్నది.
వాటాల ప్రకారం నీటిని తీసుకోవాల్సి ఉన్నా.. ఏపీ ఇప్పటికే తన వాటా 512 టీఎంసీలకు మించి అదనంగా 130 టీఎంసీలనూ తోడేసుకున్నది. అయినా ఏపీని కృష్ణా బోర్డు అడ్డుకోవడం కాదు కదా.. కనీసం ప్రశ్నించడం లేదు. త్రీమెన్ కమిటీ మీటింగ్ పెట్టి ఏపీ నీటి దోపిడీని నివారించాల్సింది పోయి.. స్పందించడమూ మానేసింది. ఈ నేపథ్యంలోనే అసలు బోర్డు ఉండీ దండగేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
త్రీమెన్ కమిటీ మీటింగ్ ఏది?
ప్రాజెక్టుల్లోని నీటి నిల్వల ఆధారంగా ఏపీ, తెలంగాణకు నీటి పంపకాలపై సీజన్ల వారీగా బోర్డు త్రీమెన్ కమిటీ మీటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. వర్షాకాలానికి ముందు ఒకసారి.. వర్షాకాలం తర్వాత మరోసారి మీటింగ్ నిర్వహిస్తుంటారు. అయితే, నిరుడు ఏప్రిల్‌లో సమావేశమైన త్రీమెన్ కమిటీ.. ఆ తర్వాత భేటీ కాలేదు. నీటి వినియోగంపై చర్చించలేదు. ఇటీవల బోర్డు మీటింగ్ నిర్వహించినా.. ఎటూ తేల్చకుండానే ముగించారు.
నీటి వాటాలు త్రీమెన్ కమిటీలోనే తేలుస్తామని బోర్డు చైర్మన్ అతుల్ కుమార్ జైన్ చెప్పినా.. మీటింగ్ ఎప్పుడు పెట్టేది మాత్రం నిర్ణయించలేదు. ఫలితంగా ఏపీ దుందుడుకుగా వ్యవహరిస్తూ తెలంగాణ నీటి ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా ప్రాజెక్టులను ఖాళీ చేసేస్తున్నది. ఈ వాటర్ ఇయర్లో ఇప్పటిదాకా ఏపీ 646 టీఎంసీలను వాడేసుకుంటే.. తెలంగాణ వాడుకున్నది మాత్రం 240 టీఎంసీలకు మించలేదు. అంటే మన కోటా కన్నా ఇంకా 60 టీఎంసీలు తక్కువే. అయినా కూడా ఏపీకి బోర్డు కనీసం నోటీసులూ ఇచ్చిన దాఖలాల్లేవు.
ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వాల్నట..
రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాల వివాదాలను తొలగించేందుకు కేఆర్ఎంబీని 2014లో కేంద్రం ఏర్పాటు చేసింది. విభజన చట్టంలోనే బోర్డు ఏర్పాటు గురించి పేర్కొన్నది. రెండు రాష్ట్రాలూ ఎంతెంత నీటిని వాడుకుంటున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. కానీ, పదేండ్లుగా ఏపీ దోపిడీ కండ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా బోర్డు ఆ రాష్ట్రాన్ని నిలువరించలేకపోయింది.
ఏపీ తీరుపై బోర్డు మీటింగ్‌లలో తెలంగాణ అధికారులు ఎండగట్టినా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కేఆర్ఎంబీ చైర్మన్ వద్దకు స్వయంగా ఈఎన్సీ వెళ్లి ఫిర్యాదు చేసే స్థితికి పరిస్థితి దిగజారింది. అధికారులు ఎప్పుడు ఏపీ తీరుపై ప్రశ్నించినా.. ప్రాజెక్టులు బోర్డు పరిధిలో లేనప్పుడు తాము మాత్రం ఏపీని ఎలా నిరోధిస్తామంటూ బోర్డు అంటోందనే వాదనలు ఇరిగేషన్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను బోర్డుకు అప్పగిస్తే పూర్తి నియంత్రణ సాధ్యమవుతుందంటూ బోర్డు మెలిక పెడుతోందనే చర్చ జరుగుతున్నది. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ సిద్ధంగానే ఉన్నా.. రాష్ట్ర సర్కారు రెడీగా లేదు. బోర్డుకు అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలు మరింత దెబ్బతింటాయనే ఆందోళనలో సర్కారు ఉంది. ఏపీ ఎత్తుగడ కూడా అదేనని అంటున్నారు.
క్యారీ ఓవర్పైనా దాటవేతే..
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కృష్ణా జలాల్లో తెలంగాణ తన కోటాలో వాడుకున్నది 25 శాతానికి మించలేదు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఒక వాటర్ ఇయర్లో వాడుకోని జలాలను తర్వాతి వాటర్ ఇయర్లో వాడుకునేలా క్యారీ ఓవర్‌కు అవకాశం ఇవ్వాలని అధికారులు బోర్డు మీటింగ్స్‌లో ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. అయితే, బోర్డు మాత్రం అది తన పరిధిలో లేదంటూ దాటవేస్తున్నది. ట్రిబ్యునల్ అవార్డులో లేదని, ఏదైనా ట్రిబ్యునల్ పరిధిలోనే ఉందని చెబుతున్నది. అదే సమయంలో ఏపీ కోటాకు మించి వాడుకుంటున్నా నోరెత్తడం లేదు.
దీంతో పదేండ్లుగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతున్నదని అధికారవర్గాలు వాపోతున్నాయి. దీనికి సరైన పరిష్కారం కేంద్రం పరిధిలోని అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే దొరుకుతుందని అధికారులు అంటున్నారు. 2020 ఆగస్టు 25న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా అప్పట్లో నాటి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. ఆ తర్వాత అక్టోబర్‌లో నిర్వహించిన మీటింగ్‌కు హాజరైనా రాష్ట్ర నీటి ప్రయోజనాలపై మమ అనిపించారే తప్ప.. గట్టిగా వాదించలేదన్న ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మరోసారి అపెక్స్‌కౌన్సిల్ మీటింగ్‌ను నిర్వహించలేదు. ఓసారి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌ను ఏర్పాటు చేసి చర్చిస్తే క్యారీ ఓవర్ వాటర్పైనా పరిష్కారం లభించేందుకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.