ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ నిరాకరణ

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు బెయిల్ నిరాకరణ

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుకు బెయిలు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ నిన్న హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం రఘురామకృష్ణం రాజు పెట్టుకున్న హౌస్ మోషన్ పిటిషన్ పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ ప్రారంభమైన వెంటనే సీఐడీ జిల్లా కోర్టుకు కాకుండా నేరుగా ఎందుకొచ్చారంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తిని సరైన కారణాలు లేకుండా అరెస్టు చేసి రిమాండుకు పంపాలని పిటిషనర్ తరపు న్యాయవాది తెలియజేశారు. ప్రాథమిక విచారణగాని, కనీస ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రాజు తరఫు లాయర్ వాదించారు. ప్రభుత్వం, పోలీసుశాఖ తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, అందుకే అరెస్టు తప్పలేదన్నారు. ఆయనను రిమాండకు పంపుతామని హైకోర్టుకు తెలుపగా ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటూ రఘురామకృష్ణం రాజు పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ.. బెయిల్ పిటిషన్ ను త్వరగా విచారించాల్సిందిగా కింది కోర్టుకు ఆదేశాలిచ్చింది.