మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్

ఏపీ రాష్ట్రం మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నరసరావుపేటలోని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఇంట్లో ఉన్న పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని.. పల్నాడు ఎస్పీ ఆఫీసుకు తరలించారు పోలీసులు. ఈవీఎం ధ్వంసంతోపాటు పలు హత్యాయత్నం కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి.. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో నాలుగు పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై విచారణ చేసిన హైకోర్టు.. జూన్ 26, 2024 ( బుధవారం ) ముందస్తు బెయిల్ పిటీషన్లను కొట్టివేసింది. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీసుకు తరలించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని.

2024 ఎన్నికల అనంతరం ఏపీలో చెలరేగిన అల్లర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అల్లర్లు రావణకాష్టాన్ని తలపించాయి. మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పోలింగ్ రోజు మొదలైన ఘర్షణలు పోలింగ్ అనంతరం కూడా కొనసాగాయి. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ప్రత్యేకబృందాలతో దర్యాప్తు చేయించింది. ఈ ఘర్షణల్లో వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పలు కేసులు నమోదవ్వగా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్ ఇచ్చింది. పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టి వేసింది హైకోర్టు.పాల్వాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసంతో సహా పలు కేసుల్లో గతంలో ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది హైకోర్టు. దీంతో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు పోలీసులు. పిన్నేల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆఫీసుకు తరలించారు.