కర్నూలులో ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం

కర్నూలులో ఏపీ హెచ్‌ఆర్‌సీ కార్యాలయం ప్రారంభం
  • ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త కార్యాలయం ప్రారంభం
  • మిగిలింది హైకోర్టు తరలింపే.. 
  • కోర్టులో విచారణ కారణంగా ఆగిన హైకోర్టు తరలింపు 

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులుండాలన్న నిర్ణయంలో భాగంగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైదరాబాద్ లో నడుస్తున్న లోకాయుక్త కార్యాలయాన్ని ఇప్పటికే కర్నూలుకు మార్పు చేసిన ప్రభుత్వం ఇవాళ మానవ హక్కల కార్యాలయాన్ని కర్నూలులో ప్రారంభించింది. నిన్నటి వరకు హైదరాబాద్ లో నడుస్తున్న ఏపీ మానవ హక్కుల కార్యాలయం ఇవాళ్టి నుండి కర్నూలు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. 
స్టేట్ గెస్ట్ హౌస్ లో సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం
మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి, జ్యుడీషియల్, నాన్ జ్యుడీషియల్ సభ్యులకు జిల్లా అధికార యంత్రాంగం వేదపండితుల సమక్షంలో పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో రూమ్ నెంబర్-1లో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్, రూమ్ నెంబర్ - 2లో జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఛాంబర్, రూమ్ నెంబర్ -4 లో నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావుల ఛాంబర్ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అంతకు ముందు హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి. శ్రీనివాస రావు గార్లకు  దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం కార్యాలయంలోని చాంబర్లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం మీడియాతో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి మాట్లాడుతూ.... ఈ రోజు నుంచి కర్నూలులో మానవ హక్కుల కమిషన్ పనిచేస్తుందన్నారు. తక్కువ వ్యవధి వల్ల స్టేట్ గెస్ట్ హౌస్ లో  కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఏర్పాటుకు చక్కని ఏర్పాట్లు చేశారన్నారు. మానవ హక్కులను ఉల్లంఘన చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు. శుభ సమయంలో మానవ హక్కుల కమిషనర్ కార్యాలయం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. 
ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం
కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని హెచ్‌ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి  తెలిపారు. మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు మరియు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.