
- జోన్ 2, జోన్ 3కి రోజూ 3,530 క్యూసెక్కులు ఇవ్వాలని బోర్డుకు లెటర్
- ఎడమ కాల్వలో తమకు 32.25 టీఎంసీలు కేటాయించారంటూ మెలిక
- ఇప్పటివరకూ18.7 టీఎంసీలు వాడుకున్నామని, మరో 14 టీఎంసీలు ఇవ్వాలని డిమాండ్
- నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఏపీకి ఇంకా మిగిలి ఉన్నది కేవలం 8 టీఎంసీలే..
- తెలంగాణ సర్కారు కళ్లు తెరవకుంటే మరో మోసం తప్పదంటున్న నిపుణులు
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్కుడి కాల్వ నుంచి ఇప్పటికే పరిమితికి మించి నీటిని డ్రా చేసుకున్న ఏపీ.. తాజాగా ఎడమ కాల్వపైనా కన్నేసింది. ఈ కాల్వ ద్వారా తెలంగాణ ఆయకట్టుకే సరిపడా నీళ్లు రావడం లేదని రైతులు మొత్తుకుంటుంటే.. ఎక్కడో జోన్2, జోన్3 పరిధిలో ఆయకట్టుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ ఏపీ మొసలికన్నీరు మొదలుపెట్టింది. ఈ రెండు జోన్ల పరిధిలోకి వచ్చే ఏపీ భూములకు రోజూ 3,530 క్యూసెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు ఈ నెల 6న కృష్ణా రివర్ మేనేజ్మెంట్బోర్డు (కేఆర్ఎంబీ)కు ఏపీ ఈఎన్సీ ఎం. వెంకటేశ్వరరావు లేఖ రాయగా, తాజాగా అది బయటకు వచ్చింది.
ఇప్పటికే సాగర్కుడి కాల్వ ద్వారా 3 వారాల క్రితం వరకు 10 వేల క్యూసెక్కుల దాకా తన్నుకుపోయిన ఏపీ.. తెలంగాణ అభ్యంతరాల మేరకు కొంచెం తగ్గింది. ఇటీవల జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్వేదికగా కుడి కాల్వ నీటిని 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాలని తెలంగాణ డిమాండ్చేసింది. అవి సరిపోవని, ఓ రెండు వారాల పాటు 7 వేల క్యూసెక్కులు కావాలని ఏపీ చెప్పడంతో బోర్డు ఓకే చెప్పింది. కానీ, బోర్డు మాటను ఏ మాత్రం ఖాతరు చేయని ఏపీ.. ఇప్పటికీ 8 వేల క్యూసెక్కులకుపైగా తోడుకుంటున్నది.
ఉన్నది 8 టీఎంసీలే.. అడుగుతున్నది చాలా ఎక్కువ..
వాస్తవానికి ఏపీ ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ద్వారా తన కోటా వాటాను దాదాపుగా వాడేసుకున్నది. ఏపీ ఖాతాలో మరో 8 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. కానీ, బోర్డుకు రాసిన లేఖలో మాత్రం.. ఎడమ కాల్వ కింద 32.25 టీఎంసీల కోటా ఉన్నట్టు దొంగ లెక్కలు కట్టింది. వాస్తవానికి ప్రాజెక్టుల వారీ కేటాయింపులు లేకపోయినా.. కాల్వల వారీగా కేటాయింపులన్నట్టు లేఖలో పేర్కొన్నది. అసలు ప్రాజెక్టుల వారీ కేటాయింపులే లేనప్పుడు.. ఈ ఎడమ కాల్వ కింద ప్రత్యేక కేటాయింపులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రాష్ట్రానికే తెలియాలని నీటిపారుదల నిపుణులు అంటున్నారు.
ఉమ్మడి ప్రాజెక్టుల్లో గంపగుత్త కేటాయింపులతోనే ఇప్పటిదాకా లెక్కలు కడుతున్నా.. ట్రిబ్యునల్కూడా గంపగుత్త కేటాయింపులపైనే వాదనలు వింటున్నా.. కాల్వ కేటాయింపులంటూ ఏపీ కొత్త మాట ఎత్తుకున్నది. శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టుల్లో ఇప్పటిదాకా ఏపీ వాడుకున్నాక మిగిలిన కోటా కేవలం 8 టీఎంసీలే. కానీ, నాగార్జున సాగర్కాల్వ కింద కేవలం 18.7 టీఎంసీలే వాడుకున్నామని, మరో 14 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందంటూ ఏపీ అడ్డంగా వాదించింది. దీనిపై తెలంగాణ సర్కారు, అధికారులు అప్రమత్తం కాకుంటే ఎడమ కాల్వ ద్వారా రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటిని కూడా ఏపీ ప్రభుత్వం గద్దలా తన్నుకుపోయే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎడమ కాల్వ నుంచి నీటిని తన్నుకుపోయే ప్లాన్
ఇటు శ్రీశైలం నీటిని, అటు నాగార్జున సాగర్కుడి కాల్వ జలాలను అడ్డూ అదుపు లేకుండా తరలించుకుపోతున్న ఏపీ.. తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రంగా గండి కొడుతున్నది. ప్రస్తుతం సాగర్ఎడమ కాల్వ ద్వారా రోజూ 9 వేల క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తున్నారు. అవి మన అవసరాలకే సరిపోవడం లేదు. కానీ, అందులో నుంచి ఇప్పుడు నూజివీడు, మైలవరం బ్రాంచ్కెనాల్స్ ఉన్న జోన్ 2, జోన్ 3 పేరు చెప్పి 3,530 క్యూసెక్కులు ఇవ్వాలని ఏపీ డిమాండ్ చేస్తున్నది.
జోన్ 2కు 1,370, జోన్ 3కి 2,160 క్యూసెక్కులు కావాలని బోర్డును అడుగుతున్నది. నీటి విడుదలలో తేడాలు వస్తుండడం వల్ల ఆయకట్టు చివరి వరకు నీళ్లు అందడం లేదని పేర్కొన్న ఏపీ.. జోన్ 2, జోన్ 3కి నీళ్లు రాక పంటలు ఎండుతున్నాయని వాదించింది. వెంటనే నీటిని విడుదల చేయాల్సిందిగా తెలంగాణను ఆదేశించాలని బోర్డును ఏపీ కోరింది.