
- నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు
- రోజుకు సగటున 7 వేల క్యూసెక్కులు మళ్లింపు
- నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకుంటామని గత నెలలో ఏపీ హామీ
- కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తుకెళ్లిన పక్క రాష్ట్రం
- సాగర్ టెయిల్‌పాండ్ నుంచి మరో 4 టీఎంసీలు కూడా..
- పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు తరలింపు
- ప్రస్తుతం సాగర్‌లో 521 అడుగుల మేర నీళ్లు.. ఇంకో ఆరడుగులు తగ్గితే సాగు నీటికి నో చాన్స్
- మనం డెడ్ స్టోరేజీ నుంచి మోటార్లను పెట్టుకుని తోడుకోవాల్సిన దుస్థితి
- కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తే.. ‘మీ వాటా నీళ్లు మీకు ఉన్నాయిగా’ అంటూ నీతులు
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నీళ్ల విషయంలో ఏపీ దోపిడీ ఆగడం లేదు. సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదలను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాలని నెల కింద జరిగిన కృష్ణా బోర్డు మీటింగ్‌లో నిర్ణయం జరిగినప్పటికీ, ఆ రాష్ట్రం మాత్రం అది పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ సాగర్‌కుడి కాల్వ నుంచి రోజుకు 6 వేల నుంచి 8 వేల క్యూసెక్కుల నీళ్లను తరలించుకుపోతున్నది. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 13 టీఎంసీల దాకా అడ్డదారిలో ఎత్తుకెళ్లింది. ఈ నెల 13 నుంచే ఏపీ తాము తీసుకునే నీళ్లను 5 వేల క్యూసెక్కులకు తగ్గించుకోవాల్సి ఉన్నా, ఆ రాష్ట్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సగటున రోజూ 7 వేల క్యూసెక్కులను తరలించుకుపోతున్నది. బోర్డు మీటింగ్ జరిగిన ఫిబ్రవరి 27 నాటికి వాడుకోవాల్సిన నీళ్లు ఏపీకి కేవలం 27 టీఎంసీలే ఉండగా.. అందులో దాదాపు సగం ఇప్పటికే వాడేసుకున్నది. మరోవైపు సాగర్ టెయిల్‌పాండ్ నుంచి కూడా 4 టీఎంసీలను తరలించుకుపోయింది.
మనోళ్లు ఫోన్ చేసినా ఏపీ స్పందిస్తలేదు..
ఫిబ్రవరి 21న కృష్ణా బోర్డు మీటింగ్జరగ్గా, ఏపీ జల దోపిడీపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24న జరిగిన మీటింగ్‌లో ఏ విషయమూ కొలిక్కి రాకపోవడంతో మీటింగ్‌ను 26కు వాయిదా వేశారు. అయితే ఆ రోజు పండుగ పేరు చెప్పి తప్పించుకున్న ఏపీ.. ఫిబ్రవరి 27న మీటింగ్‌కు హాజరైంది. ఈ సందర్భంగా ఏపీ నీళ్ల తరలింపును 5 వేల క్యూసెక్కులకు కట్టడి చేయాలని బోర్డును తెలంగాణ కోరింది. అయితే ప్రస్తుతం పంటలు చివరి దశలో ఉన్నాయని, 2 వారాల పాటు 7 వేల క్యూసెక్కులను తీసుకెళ్తామని, తర్వాత తగ్గించుకుంటామని ఏపీ హామీ ఇచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికీ సాగర్ కుడి కాల్వ నుంచి 5 వేల క్యూసెక్కులకు పైగా నీళ్లను తోడుకెళ్తున్నది. మీటింగ్ తర్వాత మొదటి 2రోజులు 7 వేల క్యూసెక్కులు తీసుకుంది. ఆ తర్వాత 2 రోజులు 6 వేల క్యూసెక్కులకు తగ్గించుకుంది. కానీ ఈ నెల 4 నుంచి 17 వరకు రోజూ 8 వేల క్యూసెక్కులకును తరలించుకుపోయింది. ఈ నెల 18 నుంచి 24 వరకు 7 వేల క్యూసెక్కులు తీసుకుపోయింది. ఇక 25 నుంచి 6 వేల క్యూసెక్కులు తరలిస్తున్నది.
బోర్డు కూడా పట్టించుకుంటలేదు..
ఏపీ జల దోపిడీపై తెలంగాణ అధికారులు కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్లినా.. బోర్డు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. పైగా ‘మీ వాటా నీళ్లు మీకు ఉన్నాయిగా..’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నది. 12 టీఎంసీలను వట్టిగా సముద్రంపాల్జేస్తున్నారంటూ రివర్స్‌లో మనపైనే నిందలు మోపుతున్నది. ఏపీ మాత్రం పెన్నా బేసిన్‌లోని పెన్నా నది నుంచి 164 టీఎంసీలను సముద్రంపాల్జేసి.. కృష్ణా నుంచి 220 టీఎంసీలకు పైగా ఔట్‌సైడ్ బేసిన్‌కు (పెన్నా బేసిన్) తరలించుకుపోతున్నా బోర్డు ఒక్క మాట మాట్లాడడం లేదు. ఈ క్రమంలో బోర్డుకు మన అధికారులు కూడా గట్టిగానే బదులిచ్చారు. లైవ్స్టోరేజీ నుంచి అక్రమంగా ఏపీ నీటిని తీసుకెళ్తుంటే అడ్డుకోవాల్సింది పోయి తమను ఎందుకు ప్రశ్నిస్తున్నారంటూ బోర్డును నిలదీశారు. ఏపీ నీటి తరలింపును ఆపితే ఆ లైవ్స్టోరేజ్ నుంచే నీటిని తీసుకుంటాం కదా! అని బోర్డుకు గట్టిగానే బదులిచ్చినట్టు తెలిసింది. లైవ్స్టోరేజీ నుంచి ఏపీ మొత్తం నీటిని తీసుకెళ్లాక.. తాము మాత్రం డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని తీసుకెళ్లాలా? అని బోర్డును నిలదీసినట్టు సమాచారం. అలాగే ఏపీ జలదోపిడీపై ప్రశ్నిస్తే.. శ్రీశైలం నుంచి పవర్జనరేషన్ ఆపాలని బోర్డు నీతులు చెబుతున్నది. దీంతో అసలు శ్రీశైలం ప్రాజెక్టును నిర్మించిందే పవర్ జనరేషన్కోసమన్న విషయాన్ని మరచిపోవద్దంటూ బోర్డుకు మన అధికారులూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
పడిపోతున్న నీటి మట్టం..
ఏపీ విచ్చలవిడిగా నీళ్లను తరలించుకుపోతుండడంతో నాగార్జున సాగర్‌లో నీటి మట్టం పడిపోతున్నది. బోర్డు మీటింగ్జరిగిన రోజు సాగర్‌లో 530 అడుగుల మేర నీళ్లుండగా.. ఈ నెల 20 నాటికి 519 అడుగులకు పడిపోయింది. అయితే ఆ తర్వాత రిటర్న్ ఫ్లోస్ద్వారా రోజూ సగటున 5 వేల క్యూసెక్కులు, ఈ నెల 16 నుంచి శ్రీశైలంలో పవర్ జనరేషన్ద్వారా రోజూ మరో 20 వేల క్యూసెక్కుల వరకు నీళ్లు ప్రాజెక్టులో వచ్చి చేరాయి. దీంతో క్రమంగా నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 521 అడుగుల నీటి మట్టం ఉంది. ఇవిరాకపోయి ఉంటే ఇప్పటికే సాగర్‌నీటిమట్టం 515 అడుగులకు పడిపోయి ఉండేది. కాగా, గురువారం నుంచి శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేశారు. అక్కడ ప్రస్తుతం నీటిమట్టం 822 అడుగుల వద్ద ఉన్నది. సాగర్‌లో 515 అడుగులు, శ్రీశైలంలో 820 అడుగుల వరకే సాగు నీటిని తీసుకోవాలని గత మీటింగ్‌లో కృష్ణా బోర్డు స్పష్టం చేసింది. అంటే శ్రీశైలంలో మరో 2 అడుగులు, సాగర్‌లో మరో ఆరడుగుల వరకే సాగు నీళ్లు తీసుకునేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఏపీ ముచ్చుమర్రి నుంచి కూడా రోజూ 500 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలిస్తున్నది.
మిర్చి పంటకు ఎక్కువగా తరలింపు..
పంటల పేరు చెప్పి నీటిని తీసుకుపోతున్న ఏపీ.. అందుకు విరుద్ధంగా చేపల చెరువులకు నీళ్లను తరలిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే చేపల చెరువుల్లో ఉన్న నీళ్లను ఖాళీ చేసి, మళ్లీ సాగర్ నుంచి తీసుకెళ్లిన ఫ్రెష్వాటర్తో నింపుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే మిర్చి పంటకు ఎక్కువగా నీటిని వాడేస్తున్నదని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. మామూలుగా మిర్చి ఒకసారి సాగు చేస్తే.. నాలుగైదు సార్లు కాపు వస్తుందని, ఆ పంటకే ఏపీ ఎక్కువగా సాగర్‌నీటిని తీసుకుపోతున్నదని అంటున్నారు.
అట్లయితే మనకు నీళ్లు కష్టమే..
సాగర్‌లో నీటి మట్టం 510 అడుగల దిగువకు వెళ్తే.. మనం నీటిని తీసుకునేందుకు అక్కడ ప్రత్యేకంగా మోటార్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దానికి తోడు కరెంట్సరఫరా కోసం ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసుకుంటే గానీ పని జరగదంటున్నారు. అంతేగాకుండా 510 అడుగుల దిగువకు వెళ్లాక అక్కడి వరకు వెళ్లేందుకు సరైన బాట కూడా ఉండదని, యాక్సెస్తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాంటి చోటుకు మోటార్లను తీసుకెళ్లాలన్నా, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలన్నా కష్టమవుతుందని అంటున్నారు. పైగా వాటికి మనమే మళ్లీ అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏపీ మాత్రం ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఖర్చు లేకుండా వట్టి పుణ్యానికి నీళ్లు తీసుకెళ్తే.. తాము మాత్రం అన్ని కష్టాలు పడుతూ, ఖర్చు పెట్టుకుంటూ నీటిని ఎందుకు తీసుకెళ్లాలన్న ప్రశ్నలను అధికారులు లేవనెత్తుతున్నారు.