తెలంగాణను స్పోర్ట్స్ హబ్​గా మారుస్తం : ఏపీ జితేందర్ రెడ్డి

తెలంగాణను స్పోర్ట్స్ హబ్​గా మారుస్తం : ఏపీ జితేందర్ రెడ్డి
  • ఇంటర్నేషనల్ ఈవెంట్స్​కు హైదరాబాద్​ను వేదిక చేస్తాం
  • ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల స్వీకరణ 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణను స్పోర్ట్స్ హబ్ గా మార్చాలన్న సీఎం రేవంత్ రెడ్డి కలను సాకారం చేస్తానని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. గత పదేండ్లలో తెలంగాణ స్పోర్ట్స్ రంగంలో వెనుకబడిందన్నారు. ‘‘2036లో ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఆ చాన్స్​ మన దేశానికి దక్కితే, హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహించేలా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం” అని తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్​లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు.

అంతకుముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం గురజాడ హాల్​లో మీడియాతో జితేందర్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఖేలో ఇండియా స్కీమ్​కు తెలంగాణ ప్రభుత్వం అప్లై చేసింది. ఈ స్కీమ్ కింద వచ్చే నిధులతో రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను కల్పిస్తాం. భవిష్యత్తులో జరగబోయే ఇంటర్నేషల్ స్పోర్ట్స్ ఈవెంట్స్​కు హైదరాబాద్ వేదికయ్యేలా కృషి చేస్తాం” అని ఆయన తెలిపారు. కాగా, జితేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కాం గ్రెస్ స్టేట్ ఇన్ చార్జ్ దీపాదాస్ మున్షీ, ఎంపీ మల్లు రవి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి జానారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల్లో టెండర్లు పూర్తి: కోమటిరెడ్డి 

ఢిల్లీలో తెలంగాణ భవన్​ను ఐకానిక్ టవర్​గా నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ‘‘చిన్న రాష్ట్రమైన సిక్కిం కూడా దేశ రాజధానిలో అద్భుతమైన గెస్ట్ హౌస్ నిర్మించుకుంది. కానీ తెలంగాణ ఏర్పడి పదేండ్లయినా భవన్ లేకపోవడం బాధగా ఉంది. ప్రస్తుతమున్న భవన్ ను ఏపీ భవన్​గానే పిలుస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించి పటౌడి హౌస్​లో ఐదున్నర ఎకరాలు, శబరి బ్లాక్ లో మూడున్నర ఎకరాలు రాష్ట్రానికి కేటాయించేలా ఒప్పించాను.

హైదరాబాద్ హౌస్ పక్కన స్థలంలో గవర్నర్, సీఎం, మంత్రుల సూట్స్ నిర్మిస్తాం. పటౌడి హౌస్ స్థలంలో జీ ప్లస్ వన్ తో తెలంగాణ భవన్ గెస్ట్ హౌస్ కడతాం” అని చెప్పారు.  ‘‘మంగళవారం దాదాపు రెండు గంటల పాటు తెలంగాణ భవన్ కు సంబంధించిన పలు డిజైన్లపై నిపుణులు ప్రజంటేషన్ ఇచ్చారు. కానీ వాటిల్లో రాజగోపురాల లాంటివి పెట్టారు. వాటిని తొలగించాలని సూచించాను. డిజైన్ ఫైనల్ కాగానే సీఎం రేవంత్ కు చూపించి, వారం రోజుల్లో డీపీఆర్ పూర్తి చేస్తాం. రెండు నెలల్లో టెండర్లు పిలిచి, పనులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాం. మూడు నెలల్లో భవన్ నిర్మాణానికి ఢిల్లీ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందేలా చూడాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించాను” అని తెలిపారు.