తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఢిల్లీలో రాష్ట్ర భవన్ నిర్మాణం : ఏపీ జితేందర్ రెడ్డి

తెలంగాణ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఢిల్లీలో రాష్ట్ర భవన్ నిర్మాణం : ఏపీ జితేందర్ రెడ్డి
  • బిల్డింగ్‌ డిజైన్‌ ఫైనల్‌లో స్టేజ్‌లో ఉంది: జితేందర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో నిర్మించనున్న నూతన తెలంగాణ భవన్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండబోతుందని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. ఈ భవన్‌లో ఆధునిక నిర్మాణ శైలీ, సమకాలీన సౌకర్యాల కల్పనతో భవిష్యత్ తరాలకు చిహ్నంగా నిలిచిపోయేలా నిర్మించనున్నట్లు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ఏపీ జితేందర్ రెడ్డి తెలంగాణ భవన్ స్థలాలను పరిశీలించారు.

భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, డిప్యూటీ కమిషనర్ సంగీత, ఆర్ అండ్ బీ డీఈ అంబేద్కర్‌‌తో కలిసి తెలంగాణ భవన్‌లోని పటౌడీ హౌస్, నర్సింగ్ హాస్టల్, గోదావరి బ్లాక్‌లలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా అధికారులు ప్రస్తుతం తెలంగాణ భవన్‌లోని మౌలిక సదుపాయాలు, కల్పిస్తున్న వసతులు, తదితర అంశాలను ఆయనకు వివరించారు. అనంతరం జితేందర్‌‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ భవన్‌కు సంబంధించి తుది డిజైన్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారన్నారు.

త్వరలో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. వచ్చే నాలుగేండ్లలోనే ఆ భవనాన్ని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ నూతన తెలంగాణ భవన్ దేశ రాజధానిలో తెలంగాణ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కార్యక్షేత్రంగా మాత్రమే కాకుండా.. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పురోగతికి చిహ్నంగా ఉండబోతోందని చెప్పారు.