మునుగోడు నియోజకవర్గంలో 90 శాతం వ్యవసాయ భూముల్లో పత్తినే సాగు చేస్తున్నారు. పత్తి గూళ్లు పగిలాయి. వర్షాలు పడకముందే పత్తిని ఏరాల్సి ఉంది. ఒక్కొక్కరికి రోజుకు రూ.300 నుంచి రూ.400 చెల్లించడానికి రైతులు సిద్ధమైనా కూలీలు దొరకడం లేదు. ప్రచారానికి, సభలకు వెళ్తే కూలి డబ్బులు ఇస్తుండడంతో స్థానికులు పత్తి ఏరడానికి, కలుపులు తీయడానికి రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడితే పత్తి నల్లగా మారుతుందనే భయంతో కర్నూలు, ఒంగోలు నుంచి కూలీలను రప్పిస్తున్నారు. వారికి రోజుకు రూ.700 నుంచి రూ.800 చెల్లిస్తున్నారు. అలాగే వారికి స్థానికంగా ఊరిలో ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమకు భారమైనా తప్పడం లేదని, ఎన్నికలయ్యే వరకు ఆగితే పత్తి చేతికందకుండా పోతుందని రైతులు చెబుతున్నారు.
ఎక్కువ కూలి ఇస్తున్నరని వచ్చినం
మాది ఏపీలోని కర్నూల్ జిల్లా చాపలమడుగు. కూలి పని చేసుకుని బతుకుతాం. మా దగ్గర వ్యవసాయ పనులకు వెళ్తే రోజుకు రూ.200 మాత్రమే ఇస్తారు. కానీ ఇక్కడ పత్తి ఏరితే కేజీకి రూ.10 నుంచి రూ.15 చొప్పున ఇస్తామని రైతులు చెప్పడంతో వచ్చాం. రోజుకు రూ.700 వరకు కూలి పడుతున్నది. భార్యభర్తలకు కలిపితే రూ.1,500 వరకు వస్తున్నది. - కోటమ్మ, కూలీ
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో స్థానిక రైతులకు కూలీలు దొరకడం లేదు. ప్రచారం, సభలకు లోకల్ లేబర్ వెళ్తుండడంతో చేతికొచ్చిన పత్తిని ఏరడానికి తిప్పలవుతున్నది. ఆలస్యం చేస్తే వర్షాలకు పత్తి రంగు మారి ధర తగ్గిపోయే ప్రమాదమున్నది. దీంతో రైతులు చేసేది లేక ఏపీ నుంచి కూలీలను రప్పిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తుండటంతో కూలి కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు.