
- మన వాటా మనకు దక్కకుండా, తాగునీటి అవసరాలకూ ఉంచకుండా శ్రీశైలం, సాగర్ ఖాళీ
- మనం వాడుకున్నది 275 టీఎంసీలే.. అంటే 27.80 శాతమే
- 50:50 వాటా ప్రకారం చూస్తే ఏపీ 195 టీఎంసీలు ఎక్కువ వాడుకున్నది
- 66:34 ప్రకారం చూసినా 28 టీఎంసీలు అదనపు వినియోగం
- చేపల చెరువులు, రిజర్వాయర్లు నింపుకున్న ఏపీ
- మళ్లీ తాగునీటి కోసం కేఆర్‌ఎంబీని అడిగేందుకు ప్రయత్నాలు
హైదరాబాద్, వెలుగు: ఏపీ జలదోపిడీ పీక్స్‌కు చేరింది. తెలంగాణ అవసరాలు తీరకుండానే శ్రీశైలం, సాగర్ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేకుండా దోచుకెళ్లిపోయింది. తాగునీటి అవసరాలకూ సరిపోను నీళ్లను ఉంచకుండా ఎత్తుకెళ్లిపోయింది. ఈ వాటర్ఇయర్లో ఏపీ ఎత్తుకెళ్లిన నీళ్లు 700 టీఎంసీలు దాటిపోయాయంటే.. ఆ రాష్ట్రం ఎంతలా జలదోపిడీకి పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణ కలిపి 992.467 టీఎంసీల నీళ్లను వాడుకోగా.. అందులో ఒక్క ఏపీ తన్నుకుపోయిన నీళ్లే 716.543 టీఎంసీలు.
అంటే ఏపీ వాడుకున్న నీళ్లు 72.20 శాతం. అదే సమయంలో తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీళ్లు కూడా దక్కలేదు. ఈ ఏడాది మన రాష్ట్రం 275.924 టీఎంసీలే వాడుకుంది. అంటే కేవలం 27.80 శాతమే. ఈ లెక్కన మనకు దక్కాల్సిన నీళ్లనూ ఏపీ గద్దలా తన్నుకుపోయింది. కాగా, ఏపీ 2022–23లో అత్యధికంగా 681.11 టీఎంసీలను తరలించుకుపోగా, ఇప్పుడు అంతకుమించి తరలించుకుపోయింది.
వాటాలనూ పట్టించుకోకుండా..
వాస్తవానికి ఈ ఏడాది మన రాష్ట్రం 50:50 నీటి వాటాల కోసం పట్టుబట్టింది. ఆ లెక్క ఆధారంగానే నీటి వాటాలను పంచాలని కృష్ణా రివర్మేనేజ్మెంట్బోర్డు(కేఆర్ఎంబీ)కు పలుమార్లు డిమాండ్లు కూడా పెట్టింది. ఆ లెక్కన తీసుకుంటే.. ఇప్పటిదాకా వాడుకున్న నీటిలో తెలంగాణ, ఏపీలకు 521.866 టీఎంసీల చొప్పున దక్కాలి. కానీ, ఏపీ 194.677 టీఎంసీలు అదనంగా వాడేసుకున్నది. మనకు ఇంకా 245.942 టీఎంసీలు రావాల్సి ఉన్నది. ఆ లెక్కన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 243.735 టీఎంసీలు మనకు దక్కాలి. కానీ, ఆ పరిస్థితి లేదు.
అదే సమయంలో నీటి వాటాలపై గతేడాది వరకు ఉన్న 66:34 నిష్పత్తి లెక్కన వాడుకోవాల్సి ఉన్నా.. ఏపీ తన కోటాను దాటిపోయింది. ఈ లెక్క ప్రకారం తెలంగాణకు 354.869 టీఎంసీలు దక్కాలి. ఏపీ 688.863 టీఎంసీలే తీసుకోవాలి. కానీ, ఏపీ అదనంగా 27.680 టీఎంసీల నీళ్లను తన్నుకెళ్లిపోయింది. మనకు దక్కాల్సిన నీళ్లలో ఇంకా 78.945 టీఎంసీలను మనం వాడుకోవాల్సి ఉన్నది. ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచే 76.738 టీఎంసీలు మనకు రావాలి.
కానీ, శ్రీశైలం, సాగర్‌లో కనీస నీటి మట్టాలైన 834 అడుగులు, 510 అడుగుల స్థాయిలో కేవలం 8.646 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. అంటే ఇంకా మనకు దక్కాల్సిన నీళ్లలో 68.092 టీఎంసీల నీళ్లను మనకు దక్కకుండా, చుక్క లేకుండా పక్క రాష్ట్రం దోచుకెళ్లిపోయింది.
ఏపీ రిజర్వాయర్లు ఫుల్..
తెలంగాణలో తాగునీటి కోసం అల్లాడుతుంటే ఏపీ మాత్రం అక్కడ చేపల చెరువులు, రిజర్వాయర్లను ఫుల్లుగా నింపి పెట్టుకున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎండాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏపీ ముందుముందుగానే నీటిని తరలించుకుని రిజర్వాయర్లను నింపుకున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు మళ్లీ తాగునీటి కోసం కృష్ణా బోర్డుకు డిమాండ్ పెట్టేందుకు ఏపీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తున్నది. తన కోటా వాడుకున్నాక, రిజర్వాయర్లను నింపి పెట్టుకున్నాక కూడా మళ్లీ మన పొట్ట కొట్టేందుకు ఏపీ కుటిల యత్నాలకు తెరతీస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
చోద్యం చూసిన కృష్ణా బోర్డు..
ఏపీ జలదోపిడీపై కృష్ణా బోర్డుకు పలుమార్లు తెలంగాణ అధికారులు ఫిర్యాదులు చేశారు. 10 వేల క్యూసెక్కులు, 8 వేల క్యూసెక్కులు.. ఇలా ఎప్పటికప్పుడు నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ తనకెవరు అడ్డు అన్న చందాన నీటిని యథేచ్ఛగా తరలించుకుపోయింది. ఏపీ నీటి తరలింపుపై సాగర్‌కుడి కాల్వ ఇన్‌స్పెక్షన్‌కు వెళ్లిన మన సిబ్బందిని అక్రమంగా పోలీసుల తో అరెస్ట్ చేయించింది. సాగర్ప్రాజెక్ట్ నుంచి ఏపీ 217.818 టీఎంసీల నీళ్లను తీసుకెళ్లగా.. కుడి కాల్వ నుంచి 188.170 టీఎంసీలు, ఎడమ కాల్వ నుంచి 29.648 టీఎంసీలు తీసుకున్న ది.
అదే సమయంలో మనం ఎడమ కాల్వ ద్వారా వాడుకున్న నీళ్లు కేవలం 171.438 టీఎంసీ లే. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోని పోతిరెడ్డిపాడు ద్వారా 209.116 టీఎంసీలను ఏపీ తన్నుకు పోయింది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా 29.550 టీఎంసీలను తీసుకెళ్లింది. ఏపీ అక్రమ తరలింపులపై తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు పెడచెవిన పెట్టింది. ఆ రాష్ట్రం కావాలని మీటింగ్‌లకు డుమ్మా కొట్టినా, నీటిని ఎత్తుకెళ్లిపోతున్నా పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆ రాష్ట్రాన్ని అడ్డుకోలేదు. బోర్డు చోద్యం చూస్తూ కూర్చోవడంతో కృష్ణా జలాల్లో మనకు తీవ్ర నష్టం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.