చైర్మన్ షరీఫ్ గడ్డంపై తీవ్ర వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఏపీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. దాంతో అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో మాటల తూటాలు పేలుతున్నాయి. రెండోరోజు ప్రారంభమైన మండలి సమావేశం గందరగోళంగా సాగింది. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ సభ్యుడి ప్రసంగం మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్.. అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత మాట్లాడిన మంత్రి అనిల్ యాదవ్.. ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయనను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు. దాంతో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రి అనిల్ సభలో తొడగొట్టారు. తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందని వ్యాఖ్యానించారు. మంత్రుల గడ్డాలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దాంతో గడ్డాలు పెంచుకున్నవారందరూ రౌడీలా అంటూ మంత్రి అనీల్ ప్రశ్నించారు. చైర్మన్ షరీఫ్ కు గడ్డం ఉంది.. అయితే చైర్మన్ రౌడీనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి గడ్డం ఉంది కదా మరి ఆయన కూడా రౌడీనా అని మంత్రి అనీల్ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని ప్రశ్నించారు. దాంతో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.
For More News..