అశ్వారావుపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్ట్‌కు గండిపడడంతో తెలంగాణ, ఏపీలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. అశ్వారావుపేట మండలం బచ్చువారి గూడెం వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని, వరదలతో దెబ్బతిన్న ఏపీలోని గ్రామాలను, రోడ్లను పరిశీలించిన అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతూ వరదలో చిక్కుకున్న 30 మందిని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పరస్పర సహకారంతోనే రక్షించినట్లు చెప్పారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవ తీసుకొని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సమాచారం ఇవ్వడంతో అప్పటికప్పుడు రెండు హెలికాప్టర్లు పంపించడంతో సహాయక చర్యలు చేపట్టడం ఈజీ అయిందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా రెండు రాష్ట్రాల సీఎంలు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.