శ్రీకాకుళం: మాజీ ముఖ్యమంత్రి జగన్ దేవుడి జోలికి వెళ్తే ఏమైందో గత ఎన్నికల్లో అంతా చూశారని ఏపీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. మనం ఏ మతానికి చెందిన వాళ్లమైనా అన్ని మతాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. తాము చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని గుర్తుచేశారు. తిరుమల వెళ్తానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
శ్రీకాకుళంలో స్కూలు పరిశీలన అనంతరం లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ... తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో తన దృష్టికి తెచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పామని లోకేశ్ తెలిపారు. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవీ సుబ్బారెడ్డి రూ.150కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారని ఆయన నిలదీశారు. తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశామని, ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారని లోకేశ్ చెప్పుకొచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని. వారి హయాంలో ఆయా వర్సిటీల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పారు. రెడ్ బుక్పై వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానమిస్తూ... ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని, ఆ ప్రకారం ఇప్పటికే రెడ్ బుక్ అమలు మొదలైందని స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి తప్పు చేసిన వారిని వదిలేది లేదని, ఇందులో భాగంగా ఐపీఎస్లు కూడా సస్పెండ్ అయ్యారని చెప్పారు. రైట్ ప్లేస్లో రైట్ పర్సన్ ఉండాలన్నదే తమ ప్రభుత్వ అభిమతమని లోకేష్ స్పష్టం చేశారు.