
కేసీఆర్ మాటలతో కసి పెరిగింది
ఆ రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని నాని
ఆర్నెళ్లలో విలీన ప్రక్రియ ముగిస్తామని వెల్లడి
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసితీరుతామని రవాణా మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. ఆర్నెళ్లలో ఆర్టీసీ విలీన హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ‘కార్మికులకు ఇచ్చిన మాటను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఏపీలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలు మాలో మరింత కసిని పెంచాయి. వేలాది మంది కార్మికులకు ఉద్యోగ భద్రత, ఆర్టీసీ అభివృద్ధిపై మాలో బాధ్యత పెరిగింది. విలీనం చేతకాదన్న కేసీఆర్‌కు ఏపీలో ఆర్టీసీని విలీనం చేసి చూపిస్తం’ అని అన్నారు. బుధవారం విజయవాడలో ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన వసతిగృహాన్ని మంత్రి ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టీసీ విలీనంపై ఆయన స్పందించారు.
పాజిటివ్ గా ముందుకెళ్తం
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె, హైకోర్టు జోక్యం, ప్రభుత్వ చర్యలను తాము గమనిస్తున్నామని మంత్రి నాని అన్నారు. ఆర్టీసీ విలీనం విషయంలో ఏపీలో ఏం జరుగుతుందో 6 నెలల్లో చూద్దాం అంటూ సీఎం కేసీఆర్ అనడం తగదన్నారు. ఆర్టీసీ విలీనం సాధ్యపడదు, ఏపీలో ఎలా చేస్తారో చూద్దాం అన్న కేసీఆర్ మాటలను పాజిటివ్ గా తీసుకుని ప్రక్రియ పూర్తిచేస్తామని మంత్రి వివరించారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని, దేశమంతటా వ్యవస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చూస్తోంటే ఏపీ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుందన్నారు. ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఎందాకైనా వెళ్తామని ప్రకటించారు. ఆర్టీసీ విలీనం మూడు నెలల్లో అవుతుందో, అరు నెలల్లో అవుతుందో కేసీఆర్‌కు చూపిస్తామన్నారు. ఏపీ ఆర్టీసీ త్వరలోనే ప్రభుత్వ రవాణా సంస్థగా పనిచేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఆర్టీసీ విలీనం ఏపీ ప్రభుత్వ ప్రయోగం కాదని, సంపూర్ణ విలీనమని స్పష్టం చేశారు. రూ. 6 వేల కోట్లకు పైగా అప్పులున్న ఒక కార్పొరేషన్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధారణ విషయమని, ఆర్టీసీని విలీనం చేయాలన్న పట్టుదలతో ఏపీ సీఎం ముందుకెళ్తున్నారని చెప్పారు. రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని కమిటీ సూచనలతో జరుగుతున్న విలీనాన్ని సీఎం కేసీఆర్.. ప్రయోగమని కామెంట్ చేయడం సరికాదన్నారు.