మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా. ఏపీ రాజకీయాలపై రజనీకాంత్‌కు అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ బాధపడుతుందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను అసెంబ్లీలో ఎలా అవమానించారో తెలిసేందుకు రజనీకాంత్‌కి వీడియోలు పంపిస్తానని చెప్పారు రోజా. రజనీకాంత్ తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు.
చంద్రబాబు మోసగాడు, ..తడిగుడ్డతో గొంతుకోసే రకం.. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆరే చెప్పారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పై చంద్రబాబు దారుణంగా కార్టూన్లు వేయించి అవమానించారన్నారు. అలాంటి వ్యక్తిని ఎన్టీఆర్ ఆత్మ ఆశీర్వదిస్తుందని, అలాంటి వ్యక్తిని చూసి సంతోషిస్తున్నానడం చాలా బాధాకరమని పేర్కొన్నారు రోజా. రజనీకాంత్ తన వ్యాఖ్యలతో ఎన్టీఆర్ అభిమానులను అవమానించారని మండిపడ్డారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కారణం.. అంతే తప్ప చంద్రబాబు వల్ల కాదని రజనీకాంత్ తెలుసుకుంటే మంచిదని పేర్కొన్నారు మంత్రి రోజా.
చంద్రబాబు విజన్ కారణంగా గత ఎన్నికల్లో 23 సీట్లకి పడిపోయారని గుర్తు చేశారు. ఇక్కడ రాజకీయాలపై అవగాహనా లేకుండా రజినీకాంత్ మాట్లాడారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ ని ఏ విధంగా అవమానించారో ఆ వీడియోలు రజినీకాంత్ కు పంపిస్తాను అని చెప్పారు. ఆ నాడు అసెంబ్లీలో ఏం జరిగిందో రజినీకాంత్ తెలుసుకోవాలని సూచించారు. సీఎం కుర్చీ కోసం చంద్రబాబు ఎన్టీఆర్ కార్టూన్లు తయారు చేయించి దారుణంగా అవమానించినట్టు రోజా తెలిపారు. హైదరాబాద్ నగరం చంద్రబాబు సీఎం కాకముందే అభివృద్ధి చెందింది. విదేశాల్లో తెలుగు ప్రజలు ఉద్యోగాలు సంపాదిస్తున్నారు అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీ రియంబర్స్మెంట్ మాత్రమే కారణమని కొనియాడారు.
విజన్ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్ కు తెలుసా? అంటూ సెటైర్లు వేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. తెలుగు ప్రజల్లో ఉన్న గౌరవాన్ని రజనీకాంత్ తగ్గించుకున్నారన్నారు. ఇన్ని గొప్పలు చెప్పుకునే వాళ్లు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలన్నారు.