- ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడి
యాదగిరిగుట్ట/ హైదరాబాద్, వెలుగు: టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు (లెటర్ ప్యాడ్స్) లేఖలను ఆమోదించి, దర్శనం కల్పిస్తామని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత ఎక్కువగా భక్తులు సందర్శించే యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
‘‘టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి 2 నెలల సమయం పడుతుంది. కొత్త పాలకమండలి ఏర్పడిన వెంటనే తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి తిరుమల దర్శనం సదుపాయాలు కల్పిస్తాం” అని వెల్లడించారు.
వెంకట్‌రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి సుభాష్
ఆర్అండ్బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కలిశారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో వారి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. హైదరాబాద్– విజయవాడ హైవేను 6 లైన్లకు విస్తరించే విషయంలో మంత్రి వెంకట్ రెడ్డి చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.