- కేటీఆర్ ఎవరో చెబితే విని చెబుతున్నారేమో..
- నేను నిన్ననే హైదరాబాద్లోనే కరెంట్ కోత అనుభవించి వచ్చా
- కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లెలా ఉన్నాయో చూపిస్తా: బొత్స సత్యనారాయణ
అమరావతి: ఏపీలో కరెంటు లేదని.. రోడ్లు దారుణంగా ఉన్నాయని.. నీళ్లు లేవంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఏపీలో కాదు.. హైదరాబాద్ లోనే సరిగా కరెంటు లేదు.. కేటీఆర్ కు ఎవరో చెబితే విని చెప్పారేమో.. నేను నిన్ననే హైదరాబాద్ లో కరెంటు కోత అనుభవించి వచ్చానంటూ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కరెంటు కోత పరిస్థితులను స్వయంగా అనుభవించి వచ్చినా తాను ఎవరికీ చెప్పుకోలేదని.. కానీ బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా చెప్పడం సరికాదన్నారు.
అలాగే రోడ్లు సరిగా లేవన్న కామెంట్ ను ప్రస్తావిస్తూ.. మంత్రి కేటీఆర్ ఏపీకి వస్తే.. రోడ్లు ఎలా ఉన్నాయో స్వయంగా చూపిస్తా.. ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డు మీద నుంచే మాట్లాడుతున్నా.. వచ్చి చూడండి అని సలహా ఇచ్చారు. తమ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గొప్పలు చెప్పుకోవచ్చు కానీ.. ఇరుగు పొరుగు రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ తన వ్యాఖ్యలనువెనక్కి తీసుకోవాలని మంత్రి బొత్స సూచించారు.
ఏపీలో పవర్ కట్ లేదు.. పరిశ్రమలకే కొంత తగ్గించాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఏపీలో పవర్ కట్ ఎక్కడా లేదని.. కాకపోతే పరిశ్రమలకే కొంతమేర తగ్గించామన్నారు. తెలంగాణ వారికి సింగరేణి కాలరీస్ వల్ల బొగ్గు అందుబాటులో ఉంది.. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉండొచ్చు.. మహారాష్ట్రలోని అనేక పట్టణాలు, నగరాల్లో పగలే కరెంట్ లేని పరిస్థితి.. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని వివరించారు. ఏపీలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు ఎక్కువ ధరకు కొని అయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు.
రోడ్లు బాగాలేవన్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. తెలంగాణలో కంటే ఎక్కువ కిలోమీటర్లు రోడ్లు ఏపీలో వేశామన్నారు. ఏపీలో చారిత్రక రీతిలో తెలంగాణ కంటే ఎక్కువగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపట్టామని.. అలాగే 10వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులు చేపట్టబోతున్నామని.. గత ఏడాదికంటే.. ఈ ఏడాది రోడ్ల పరిస్థితి బాగుంటుందన్నారు. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి.. ఏపీలో దారుణంగా ఉంది.. వారికంటే మనం చాలా బెటర్ అని చెప్పుకుంటే తమకు ఓట్లు వస్తాయనుకుని కేటీఆర్ అలా చెప్పుకున్నారేమో... అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
దేశంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్
రైతు 31 పైసల బకాయి చెల్లించలేకపోతే ఏం జరిగిందో తెలుసా.?
వావ్: స్టూడెంట్ తో కలిసి టీచర్ స్టెప్పులు