ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
విజయవాడ: తుంగభద్ర పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు దాదాపు వంద కిలోమీర్లకుపైగా సరిహద్దుగా ఉన్న తుంగభద్ర నది పుష్కరాల నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం ముందు నుండి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. తెలంగాణ కంటే ముందుగా 100 కోట్ల నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు పలుమార్లు సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారుల నివేదికలు.. కర్నూలు జిల్లా మంత్రుల కోరిక మేరకు ముఖ్యమంత్రి జగన్ వందకోట్లు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు. కరోనా వ్యాప్తి ఇప్పటకీ ఉన్న నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజలకు సౌకర్యాల కొరత రాకుండా చూసేందుకు రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు. ప్రజల్లో కరోనా భయాందోళనలు ఉన్న నేపధ్యంల తీసుకోవాల్సిన చర్యలపై కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు, మునిసిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర, కార్మిక మంత్రి గుమ్మనూు జయరాంతో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒక మారు వచ్చే ఈ పుష్కరాలను పురష్కరించుకుని పుష్కర ఘాట్లకు నేరుగా వాహనాలు వెళ్లేలా రోడ్లు మరమ్మత్తు చేయాలని.. అవసరమైతే కొత్త రోడ్లు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. కొత్త పనులతో పాటు పాత రహదారుల మరమ్మత్తుకు ఈ 100 కోట్ల నిధులు వినియోగించాలని నిర్దేశించింది. ప్రజలు స్వేచ్ఛగా.. నిర్భయంగా పుష్కర స్నానాలు చేసుకుని ప్రశాంతంగా.. సంతోషంగా తిరిగి వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్న సీఎం ఆదేశాలను ఎలా అమలు చేయాలన్న దానిపై మంత్రులు సమీక్షించి అధికారులకు సూచనలిచ్చారు. వీడియో కాన్ఫరెన్సులో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మంత్రులతో మాట్లాడారు. తాను స్వయంగా తిరిగి చూసిన స్నానాల ఘాట్ల పరిస్థితిని… చేయాల్సిన ఏర్పాట్లను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.