- ఆ రాష్ట్రాల్లోంచి వచ్చేవారికి వారం రోజులు క్వారంటైన్
- బార్డర్స్ లో లాక్డౌన్ రూల్స్ పై డీజీపీ క్లారిటీ
అమరావతి: ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఏపీకి రావాలంటే తప్పనిసరిగా స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాల్సిందేనని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ 5 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఎత్తివేసింది. దీంతో తెలంగాణ, ఇతర రాష్ట్రాలు అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధాలను ఎత్తివేశాయి. ఈ క్రమంలో ఏపీకి వస్తున్న వారికి తప్పని సరిగా టెస్టులు నిర్వహిస్తామని ప్రకటించిన అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రయాణికుల ఎంట్రీపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. ఈ రోజు(సోమవారం) నుంచి బార్డర్స్ అన్లాక్ చేయకూడదని నిర్ణయించినట్లు డీజీపీ మీడియాకు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి రావాలనుకునేవారు కచ్చితంగా స్పందన పోర్టల్ నుంచి పాసు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అలా వచ్చిన వారికి టెస్టులు నిర్వహించి నెగిటివ్ వస్తే మాత్రమే హోం క్వారంటైన్ కి పంపిస్తామని, ఎక్కువ కేసులున్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి మాత్రం తప్పనిసరిగా వారం పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని క్వారంటైన్ సెంటర్ లో వారం రోజులు గడపాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత నెగిటివ్ వస్తే హోం క్వారంటైన్ విధిస్తామని డీజీపీ చెప్పారు. దీనిపై తదుపరి నోటీసులు వచ్చే వరకు నిషేధ ఉత్తర్వులు అంతర్ రాష్ట్ర బార్డర్లలో కొనసాగుతాయన్నారు.
ఇతర రాష్ట్రాల నుండి రైళ్ల ద్వారా ఏపీకి వచ్చే వారికి రైల్వే స్టేషన్లు లేదా జిల్లా రిసెప్షన్ సెంటర్లలో టెస్టులు నిర్వహిస్తామని స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్ లో 14 రోజులు నిర్భంధంలో ఉండాల్సిందేనన్నారు.