జగన్ ను మ్యూజియంలో పెట్టాలి.. షర్మిల

వైసీపీ అధినేత జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. జగన్ కేవలం 11సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినప్పటికీ ఆయన్ని వదలడంలేదు షర్మిల. ఎక్స్ వేదికగా జగన్ పై తరచూ పంచ్ లు, సెటైర్లు వేస్తున్న షర్మిల తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వచ్చి నిలదీయండని అంటే, చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా, మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలని సెటైర్ వేశారు.

అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకేనని.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుందని అన్నారు. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియాలో తనను కించపర్చేంత ద్వేషం జగన్ కు ఉందని, తనకు ద్వేషం లేదని అన్నారు.కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉందన్నారు షర్మిల. ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం తనకు ఉందని, అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదని అన్నారు.జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు కాబట్టే తప్పు అన్నామని, చట్ట సభను గౌరవించకపోవడం తప్పు కాబట్టే రాజీనామా చేయమన్నామని అన్నారు.

 

అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లని అన్నారు. వైసీపీలో వైఎస్సార్ ని ఎప్పుడో వెళ్లగొట్టారని, ఇప్పుడు ఉన్నది కేవలం వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి,ఆర్ అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే ఉన్నారని అన్నారు. వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం జగన్ కు చేత కాదని.. మీకు మీడియా పాయింటే ఎక్కువ అని ఎద్దేవా చేశారు.