
- స్థానిక ఫలితాలపై జగన్ స్పందన
అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి జగన్ సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా వైసీపీ భారీ ఆధిక్యంతో కైవసం చేసుకోవడంపై జగన్ స్పందిస్తూ 100కు 97 మార్కులు వేసి ప్రజలు ఆశీర్వదించారని పేర్కొన్నారు. ఒకటి ఆరా మినహా దాదాపు అన్ని స్థానాల్లోనూ చారిత్రక రీతిలో విజయం సాధించడంతో ట్విటర్ వేదికగా జగన్ స్పందించారు. ఓటరు దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. 'దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు' అని సీఎం జగన్ పేర్కొన్నారు.
మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు ఇవే
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా నందికొట్కూరు, బేతంచెర్ల, కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా ఒక్క ప్రకాశం జిల్లాలోని దర్శి మినహా అన్ని మున్సిపాలిటీలను, నగర పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది. ఈ ఘన విజయంపై వైఎస్ జగన్ స్పందించారు.
దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు... ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 17, 2021