
పోలవరం టు బానకచర్ల వయా సాగర్
వాప్కోస్ ప్రతిపాదనకు జగన్ ఓకే
జనవరిలోపు డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు ఆదేశం
గోదావరి, కృష్ణా లింక్ కు ఏపీ ప్లాన్
పోలవరం టు బానకచర్ల వయా సాగర్
వాప్కోస్ ప్రతిపాదనకుసీఎం అంగీకారం
రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటి తరలింపు
అమరావతి, వెలుగు: కృష్ణా ఆయకట్టు, రాయలసీమలో నీటి వినియోగం పెంపుపై ఏపీ సర్కారు కసరత్తు చేస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెపాసినటీ పెంపు ద్వారా 60 టీఎంసీల కృష్ణా నీటిని తరలించుకోవాలని ప్లాన్ చేసిన ఏపీ తాజాగా గోదావరి, కృష్ణా నదుల లింక్ కు ప్లాన్ చేసింది. శుక్రవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గోదావరి కృష్ణా లింక్ కోసం వాప్కోస్ సంస్థ తన ప్రతిపాదనలను సీఎం జగన్ కు అందించింది. దీని ప్రకారం గోదావరి నది నుంచి కృష్ణా నదికి లింక్ కెనాల్ నిర్మిస్తారు. గోదావరి వరద జలాలను గుంటూరు జిల్లా బొల్లాపల్లి వద్ద నూతనంగా నిర్మించిన 150 టీఎంసీల భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు తరలిస్తారు.
వర్షాకాలంలో రోజుకు 2 టీఎంసీలు చొప్పున.. వాటర్ సీజన్ లో 200 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా ఆయకట్టుకు తరలించే అవకాశం ఏర్పడుతుంది. బొల్లాపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రాయలసీమలోని బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా పెన్నా బేసిన్ లింక్ కెనాల్ తవ్వుతారు. దీంతో గోదావరి వరద నీటిని కృష్ణా ఆయకట్టు, రాయలసీమలో రెండో పంటకు ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుందని ఏపీ సర్కారు భావిస్తోంది. దీని కోసం పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచనున్నారు. గోదావరి వరదను పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదిలోకి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లికి తరలించనున్నారు. వాప్కోస్ ప్రతిపాదనలను అంగీకరించిన సీఎం జనవరిలోపు డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు.