
2019 జనరల్ ఎలక్షన్స్ లో పలువురు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విష్ణు మూర్తి, తరుణ్ కుమార్, జయ కృష్ణ, ఎం జగదీష్ లు ఇంటర్ నెట్ సహాయంతో పలువురు రాజకీయ నాయకులకు స్ఫూఫ్ కాల్ చేసి… టీడీపీ, వైసీపీ పార్టీల నుంచి ఎన్నికలలో పోటీచేయడానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామంటూ నమ్మించారు. వైసీపీ చీఫ్ జగన్, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు కార్యదర్శులు తమకు టచ్ లో ఉన్నట్లు పలువురిని నమ్మించి వారినుంచి భారీగా ధనాన్ని తీసుకున్నారు. ఎంతకాలమైనా తమకు ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, దాట్ల సుబ్బరాజు మరియు ప్రస్తుత శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, సిదిరి అప్పలరాజు, ఫిర్యాదుతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగి నింధితులను పట్టుకున్నారు. వారి నుంచి 5.80లక్షల నగదు, 28.22 గ్రాముల బంగారం, 5 మొబైల్ ఫోన్స్ , ఇంటర్నెట్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.