- హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇదే కేసులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా..
హైదరాబాద్, వెలుగు: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం హైదరాబాద్ మియాపూర్ లో ఉన్న సురేశ్ ను సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను మంగళగిరికి తరలించారు. అంతకుముందు ఏపీలోని ఉద్దంరాయునిపాలెంలో ఆయన ఇంటికి వెళ్లి వెతకగా కనిపించలేదు. సెల్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి హైదరాబాద్ పారిపోయినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించి ఆయనను అరెస్టు చేశారు.
కాగా.. వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నపుడు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని 2021అక్టోబరు 19న వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 21 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘరామ్ పైనా కేసులు నమోదు చేశారు. ఏపీ హైకోర్టులో వీరంతా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. వారిలో సురేశ్, లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేయగా.. మిగతా నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.