జూబ్లీహిల్స్, వెలుగు: సినీ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మను అరెస్టు చేసేందుకు ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు రూరల్ పోలీసులు సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లో భాగంగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరుస్తూ సోషల్ మీడియాలో ఆర్టీవీ పోస్టులు పెట్టారని మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది.
దీంతో విచారణకు రావాలంటూ పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. ఈనెల 19న పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా, నాలుగు రోజుల సమయం కావాలని కోరారు. సమయం ఇచ్చినప్పటికీ ఈనెల 25న ఎదుట హాజరుకాకపోవడంతో అరెస్ట్ చేసైనా తీసుకెళ్లేందుకు ఏపీ పోలీసులు సిటీకి వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుతిరిగారు.