రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిన్నటికి నిన్న ఏపీలోని ఒంగోలు నుంచి వచ్చిన పోలీసులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ లోని ఇంట్లో వర్మ లేకపోవటంతో.. మూడు గంటలు వెయిట్ చేశారు పోలీసులు. పోలీసుల సమాచారం ముందుగా తెలిసిందో లేక.. పనిపైన బయటకు వెళ్లారో కానీ.. వర్మ మాత్రం ఇంటికి తిరిగి రాలేదు. షూటింగ్ పనిపై తమిళనాడులోని కోయంబత్తూరు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయారు ఏపీ పోలీసులు.
వర్మ విషయంలో ఏపీ పోలీసులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు సార్లు విచారణకు హాజరుకాని వర్మ కోసం.. హైదరాబాద్, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు ఏపీ పోలీసులు. ఈ క్రమంలోనే ఓ బృందం హైదరాబాద్ లోని వర్మ డెన్ పై నిఘా పెట్టగా.. మరో ఏపీ పోలీస్ బృందం కోయంబత్తూరు వెళ్లారు. అక్కడ షూటింగ్ చోటకు వెళ్లి నోటీసులు అందించటంతోపాటు.. అరెస్ట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే క్లారిటీకి వచ్చిన రాంగోపాల్ వర్మ.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్లు దాఖలు చేశారు. ఒంగోలు, విశాఖఫట్నం, గుంటూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు రాంగోపాల్ వర్మ. ఈ పిటీషన్లపై 2024, నవంబర్ 26వ తేదీ విచారణ చేయనుంది కోర్టు. కోర్టు ఆదేశాలకు ముందే వర్మను అదుపులోకి తీసుకోవాలని ఏపీ పోలీసులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది