జోగులాంబ ఆలయ అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసుల సిఫారసు

జోగులాంబ ఆలయ అర్చకుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ పోలీసుల సిఫారసు

గద్వాల, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయ అర్చకుడిపై క్రిమినల్  కేసు నమోదు అయిందని, ఆయనపై డిపార్ట్​మెంటల్​ యాక్షన్​ తీసుకోవాలని ఏపీ పోలీసులు తెలంగాణ ఎండోమెంట్  శాఖకు లెటర్  రాశారు. సదరు అర్చకుడిపై ఎండోమెంట్​ ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు ఫ్యామిలీతో కలిసి గత ఏడాది డిసెంబర్ 23న  కర్నూల్ లో సినిమాకు వెళ్లారు. 

ఆ సమయంలో బాల బ్రహ్మేశ్వరస్వామి టెంపుల్ లో పూజారిగా పని చేస్తున్న ఆనంద్ శర్మ సీక్రెట్ గా వీడియోలు, ఫోటోలు తీస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. దీనిపై ఎమ్మెల్యే కర్నూల్ టూ టౌన్  పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 24న కంప్లైంట్ చేశాడు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై పోలీసులు క్రైం నంబర్ 215/2024 బీఎన్ఎస్  సెక్షన్78(2),351(2), ఎస్సీ, ఎస్టీ సెక్షన్3(2),(va), ఐటీ చట్టం 66 ప్రకారం కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ క్రిమినల్  చర్యలకు పాల్పడ్డ అర్చకుడు ఆనంద్ శర్మ పై డిపార్ట్ మెంటల్  చర్యలు తీసుకోవాలంటూ కర్నూల్  డీఎస్పీ బాబు ప్రసాద్  తెలంగాణ ఎండోమెంట్  రీజినల్  కమిషనర్ కు, ఆలయ ఈవోకు లెటర్లు రాశారు. 

ఏపీ పోలీసులు ఈ కేసులో ఆధారాలు సేకరించి కోర్టులో చార్జిషీట్  దాఖలు చేశారు. కానీ, ఇప్పటివరకు అర్చకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదిలాఉంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై ఆనంద్ శర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించి నాట్ అరెస్ట్  ఆర్డర్స్  తీసుకున్నాడని తెలుస్తోంది. కేసు విషయంలో అరెస్ట్​ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న ఆయనపై డిపార్ట్​మెంట్​ యాక్షన్​ ఎందుకు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తుతోంది. 

ఈ విషయమై ఆలయ ఈవో పురేందర్​ను వివరణ కోరగా.. ఏపీ పోలీసులు డిపార్ట్​మెంట్  యాక్షన్​ తీసుకోవాలని సిఫారసు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. దీంతో పాటు అసెంబ్లీ స్పీకర్  నుంచి వచ్చిన కంప్లైంట్ పై కూడా కలెక్టర్, ఎండోమెంట్  ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. అర్చకుడిపై చర్యలు తీసుకునే ఫైల్​ ఎండోమెంట్ కమిషనర్  దగ్గర పెండింగ్ లో ఉందని తెలిపారు.