ఏపీ నుంచే పెద్దల సభకు? హాట్ టాపిక్గా చిరంజీవి రీ ఎంట్రీ..!

ఏపీ నుంచే పెద్దల సభకు? హాట్ టాపిక్గా చిరంజీవి రీ ఎంట్రీ..!

* విజయసాయి ప్లేస్ను మెగాస్టార్తో భర్తీ చేస్తారని ప్రచారం

* రాజ్యసభలో బలం పెంచుకునేందుకే ఎన్డీఏ పావులు

* చిరంజీవికి సముచిత గౌరవం ఇస్తామని గతంలో చెప్పిన కిషన్ రెడ్డి

* తమ్ముడి పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్తారా?

* బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా..?

* రేసులో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా!

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభలో అడుగు పెట్టడం దాదాపు ఖాయమైపోయిందనే ప్రచారం ఊపందుకుంది. వైసీపీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానానికి ఖాళీ ఏర్పడింది. రాజకీయాల్లో ఉండనని, వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ స్థానానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి చిరంజీవిని బరిలోకి దించే అవకాశం ఉంది. అయితే ఆయన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది.

ఏపీలో వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు రాజీనామా చేశారు. అందులో బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన బీజేపీ తరఫున తిరిగి ఎన్నికయ్యారు. కృష్ణయ్య కన్నా ముందు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడటంతోపాటు రాజ్యసభ ఎంపీ పదవులు వదులుకున్నారు. తర్వాత నోటిఫికేషన్ రాగా సానా సతీశ్, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులయ్యారు. పొత్తులో భాగంగా జనసేనకు ఒక ఎంపీ పదవి రావాల్సి ఉంది.

ALSO READ | వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‎కు బెయిల్

విజయసాయి రెడ్డి రాజీనామా చేయడంతో ఏర్పడ్డ ఖాళీని జనసేనకు కేటాయించి చిరంజీవిని రాజ్యసభకు పంపేందుకు ఎన్డీఏ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బీజేపీ తరుఫునే బరిలో నిలుస్తారని కూడా మరో చర్చ ఉంది. అయితే బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కి అవకాశం కల్పిస్తారని అంటున్నారు.

ఎన్డీఏకు రాజ్యసభలో బలం సరిపడా లేదు. కీలక బిల్లులు పాస్ కావాలంటే పెద్దల సభ ఆమోదం తప్పనిసరి. దీంతో వీలైనన్ని రాజ్యసభ సీట్లను పొందేందుకు ఎన్డీఏ పావులు కదుపుతోంది. విజయసాయి రెడ్డి రాజీనామా కూడా ఇందులో భాగమేననే ప్రచారం కూడా ఉంది. చిరంజీవిని రాజ్యసభకు పంపడంతోపాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇస్తారనేది చర్చల్లో ఉంది.