
వనపర్తి, వెలుగు: ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తన ఇంటిలో మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం కుడి మెయిన్ కెనాల్ లైనింగ్ పనులు, కృష్ణా నదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులతో కెనాల్ కెపాసిటీ 44 వేల క్యూసెక్కుల నుంచి 89,762 క్యూసెక్కులకు పెరుగుతుందని తెలిపారు. దీంతో నాగార్జునసాగర్, కల్వకుర్తి లిఫ్ట్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో రాష్ట్రంలోని రైతులు సాగునీటి కోసం తిప్పలు పడాల్సి వస్తుందన్నారు.
శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ తగ్గడం వల్ల విద్యుత్ ఉత్పాదన, ఇతర నీటి ఆధారిత కార్యకలాపాలు దెబ్బతింటాయన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పు తెలంగాణకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం, కెనాల్ లైనింగ్ పనులను నిబంధనలకు విరుద్ధంగా చేపడుతోందన్నారు. ఏపీలోని టీడీపీ సర్కారు రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా బలపడేందుకు జలదోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు.కేంద్రం చేతిలో కీలుబొమ్మగా ఉన్న కేఆర్ఎంబీ ఏపీ ప్రయత్నాలను నిలువరించడం లేదని, దీనిని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు శ్రీశైలం నుంచి నీళ్లు తరలించకుండా చూడాలని కోరారు. గట్టుయాదవ్, వాకిటిశ్రీధర్, అశోక్, కురుమూర్తి పాల్గొన్నారు.