బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్

వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం .. వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీ  విపత్తుల  నిర్వహణ సంస్థ తెలిపింది.  దీని ప్రభావంతో  రాగల 36 గంటల్లో ( ఆగస్టు 31నుంచి ) ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.  దీంతో  శనివారం (ఆగస్టు 31) అక్కడక్కడ భారీ వర్షాలు...ఎల్లుండి (సెప్టెంబర్​ 1)  అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు... మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం  ఉంది, 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఇది శనివారానికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ (Rayalaseema) జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.  శని, ఆదివారాల్లో  ( ఆగస్టు 31, సెప్టెంబర్​ 1) ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ALSO READ | హైదరాబాద్ వాసులకు అలర్ట్: ఇయ్యాల అతిభారీ వర్షాలు..

అటు, దక్షిణ కోస్తాలోనూ భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఆదివారం వరకూ సముద్రం అలజడిగా ఉంటుందని గరిష్టంగా గంటకు  45-నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్‌లో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. వర్షాల సమయంలో కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  ఆంధ్రప్రదేశ్​ విపత్తుల నిర్వహణ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్  సూచిస్తున్నారు.

రేపు (ఆగస్టు 31)  శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని… ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.