ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు, ఎల్లుండి ( ఆగస్టు 18,19) ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటకను ఆనుకుని తెలంగాణ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీకి రెండ్రోజుల వర్షసూచన చేసింది వాతావరణ శాఖ. ఐఎండీ సూచనల ప్రకారం కర్ణాటకను ఆనుకుని ఉన్న తెలంగాణ వరకు ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్లో రెండు రోజుల పాటు ( ఆగస్టు 18,19) శ్రీకాకుళం,విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ప్రకాశం,నంద్యాల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అలాగే కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్,అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్లు కింద, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు