- మైనింగ్ మాఫియాకు అడ్డాగా సర్వే నంబర్ 302
- పీసా చట్టంలోని లొసుగులే ఆధారం
- ఏజెన్సీలో అక్రమంగా క్వారీ, క్రషర్ నిర్వహణ
ఖమ్మం/ పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి ఏజెన్సీ ఏరియాలో ఏపీ రాష్ట్రానికి చెందిన మైనింగ్ వ్యాపారులు బినామీ పేర్లతో కోట్లు కొల్లగొడుతున్నారు. మైనింగ్ డిపార్ట్ మెంట్ నుంచి టెంపరరీ పర్మిట్లు తీసుకుంటూ, 20 ఏండ్లుగా ఇద్దరు స్థానికేతరులైన గిరిజనుల పేర్ల మీద లీజుకు నడిపిస్తున్నారు. పీసా చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో మైనింగ్ పర్మిషన్ కోసం గిరిజనులతో సొసైటీ ఏర్పాటు చేసి, సంబంధిత రెవెన్యూలో గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ చట్టంలోని లొసుగులను ఆధారంగా చేసుకొని ఇద్దరు గిరిజనుల పేరుతో వేర్వేరుగా రెండున్నర హెక్టార్ల చొప్పున లీజుకు తీసుకున్నారు. మైనర్ మినరల్స్గా తక్కువ విస్తీర్ణం చూపించి అనుమతులు తీసుకున్నారు. లింగగూడెం రెవెన్యూలోని 302 సర్వే నెంబర్లో దేవతల గుట్టను గుల్ల చేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్తో పేలుళ్లు చేస్తూ, పెద్ద ప్రొక్లెయిన్లను ఉపయోగిస్తూ తవ్వకాలు జరుపుతున్నారు. క్వారీ పక్కనే ఏపీ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారుల ఇనాం భూములను కొనుగోలు చేసి తెలంగాణ పట్టాదారు పాసు పుస్తకాలను పొందారు. అందులో క్రషర్ ఏర్పాటుచేశారు. క్వారీ నుంచి క్రషర్ కు మెటల్ తరలిస్తూ, రోడ్లు, రైల్వే ప్రాజెక్టులకు సప్లై చేస్తున్నారు. తమ గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తూ, ఏటా కోట్లు సంపాదిస్తున్న వ్యాపారులు తమ గ్రామానికి గానీ, ప్రభుత్వానికి గానీ ఏ రకమైన పన్నులు చెల్లించడం లేదని, అభివృద్ధికి సహకరించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు.
నిబంధనలు పాటిస్తలేరు..
ఏజెన్సీలో పట్టాదారు వారసులు, గిరిజనులు మాత్రమే భూములు బదలాయించుకునే అవకాశం ఉంది. కానీ ఏజెన్సీలోని భూములను ఏపీ వ్యాపారులు కొని, పట్టాదారు పాసు పుస్తకాలను పొంది రైతుబంధు తీసుకుంటున్నారు. కంకర తరలింపులో ట్రిప్ షీట్లు గానీ, వే బిల్లులు లేకుండానే ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు ట్యాక్స్ చెల్లించకుండా రూ.కోట్లు కొల్లగొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఏజెన్సీలో యాక్ట్ 1988 ప్రకారం బినామీ పేర్లతో ప్రభుత్వాన్ని మోసం చేసి పరిశ్రమలు, ప్రాజెక్ట్ నడిపినట్లు అధికారులకు రుజువులు ఉంటే నోటీస్ ఇవ్వకుండానే స్వాధీనం చేసుకోవచ్చు. కానీ అధికారులకు బినామీ క్వారీలు అని తెలిసినా, చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పేలుళ్లతో చుట్టుపక్కల ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోందని, ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయని పరిసర గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని అంటున్నారు.
ఇండ్లు, పంటలు పాడైతున్నయ్..
దేవతల గుట్టలో పేలుళ్ల ధాటికి రాళ్లు, దుమ్ము మా పంటలను నాశనం చేస్తున్నాయి. ఇంటి గోడలకు పగుళ్లు వస్తున్నాయి. ఆ ప్రాంతంలో పశువులను మేపాలంటేనే భయంగా ఉంటోంది. క్వారీలో ఏ ఒక్క గిరిజనుడికి ఉపాధి కల్పించలేదు. ఏజెన్సీలో పీసా యాక్ట్ ను అమలు చేయకుండా మైనింగ్ శాఖ అధికారులు అన్యాయం చేస్తున్నారు.
సరియం నాగేశ్వరరావు, గట్టుగూడెం
క్రషర్ పనులు ఆపాలని ఆదేశించాం
నాలా కన్వర్షన్కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని యాజమాన్యాన్ని ఆదేశించినా నెల రోజుల నుంచి దాటవేస్తున్నారు. క్వారీకి సంబంధించిన గిరిజనుడు కూడా స్థానికుడు కాదు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన వ్యక్తి గా గుర్తించాం. క్వారీ, క్రషర్ పనులు ఆపాలని ఆర్ఐ ద్వారా నోటీసులు పంపినం. దేవతల గుట్టలోని క్రషర్, క్వారీలపై కలెక్టర్ కు నివేదిక పంపుతున్నాం.-
రమాదేవి, తహసీల్దార్, పెనుబల్లి