అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థి మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ విద్యార్థి మృతి

న్యూయార్క్: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ తెలుగు అమ్మాయి మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్​పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‎లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ప్రముఖ వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ(26) ఎంఎస్ చేయడానికి 2022 డిసెంబరులో అమెరికా వెళ్లారు. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్​యూనివర్సిటీలో చదువుతున్నారు. 

శుక్రవారం అర్ధరాత్రి పవన్, నిఖిత్ అనే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ వెనుకనుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో నాగశ్రీ వందన పరిమళకు తీవ్ర గాయాలు కాగా, దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయని, వైద్యులు చికిత్స చేస్తున్నారని అమెరికా పోలీసులు తెలిపారు. 

ఇందులో పవన్ కండిషన్​సీరియస్‎గా ఉందని చెప్పారు. ట్రక్​అదుపుతప్పి కారును ఢీకొన్నట్టు పోలీసుల ప్రాథమిక నివేదికలో తేలింది. ఇదిలా ఉండగా, వందన మృతితో తెనాలిలోని ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్యామిలీతోపాటు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వందన మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు, స్థానిక సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు తండ్రి గణేష్​ తెలిపారు.