- ఇసుక తవ్వేందుకు అడ్డు చెబుతున్న రాయలసీమవాసులు
- మన ఇసుకను ఏపీ వాళ్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు
- జాయింట్ సర్వే తోనే సమస్యకు పరిష్కారం
గద్వాల, వెలుగు: తుంగభద్ర నదిలో ఇసుక విషయంలో ఏపీ, తెలంగాణ సరిహద్దులో వివాదం నడుస్తోంది. కొంతకాలంగా మన ప్రాంతంలోని ఇసుకను ఏపీ వారు తోడేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని నది తీర ప్రాంత గ్రామాల ప్రజలు చెబుతున్నారు. మన హద్దులో ఇసుకను తోడుకునేందుకు వెళ్లే వాహనాలను అడ్డుకుంటూ, వారే మర బోట్ల ద్వారా ఇసుకను తోడేస్తున్నారని వాపోతున్నారు.
ఇప్పటికే ఇసుకను రాత్రి, పగలు తేడా లేకుండా దోచేశారు. తుంగభద్ర నదిలో హద్దులు లేకపోవడంతోనే ఈ వివాదాని కారణమవుతోందని, ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో సమస్య ముదురుతోంది.
అడ్డుకోవడం అక్కడ మామూలే..
తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాల కోసం మైనింగ్ శాఖ తూర్పు గార్లపాడు, పెద్ద ధన్వాడ, తుమ్మిళ్ల రీచ్ లకు పర్మిషన్ ఇచ్చింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా మన ప్రాంతంలోని తుంగభద్ర నదిలో ఇసుక తవ్వుకుంటుండగా, ఏపీలోని కర్నూల్ జిల్లా పొంతలపాడు గ్రామస్తులు, పొలిటికల్ లీడర్లు, ఇసుక మాఫియా తవ్వకాలను తరచూ అడ్డుకుంటున్నారు. తమ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టవద్దంటూ గొడవలకు దిగుతున్నారు.
తెలంగాణ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా మర బోట్లతో ఇసుకను తరలిస్తున్నా.. ఇక్కడి ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోవడంతో వారు రెచ్చిపోతున్నారనే విమర్శలున్నాయి. ఇక్కడి ఇసుకను తవ్వుకుంటూ ఇక్కడి ప్రజలపైనే దాడులు చేసే పరిస్థితి వస్తోంది. పొంతల పాడ్ కు చెందిన చెందిన ఇసుక మాఫియా వారు తెలంగాణ సరిహద్దులోకి వచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ ఇసుకను తరలిస్తున్నారు.
సరిహద్దు సమస్య తేలేనా?
తుంగభద్ర నదిలో సరిహద్దు సమస్య చాలా కాలంగా ఉంది. దీనిపై ఆఫీసర్లు దృష్టి పెట్టకపోవడంతో వందల క్యూబిక్ మీటర్ల ఇసుకను ఏపీకి చెందిన వారు తరలించుకుపోయారని నది తీర ప్రాంత ప్రజలు చెబుతున్నారు. నాలుగు రోజుల కింద రెవెన్యూ, మైనింగ్, పోలీస్ ఆఫీసర్లు సరిహద్దు సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో మన సరిహద్దు ప్రాంతంలో ఒక కిలోమీటర్ మేర ఇంకా ఇసుక తవ్వకాలు చేపట్టడం లేదు. వివాదం లేని ప్రాంతంలోనే ఇసుకను తెలంగాణ మైనింగ్ శాఖ ద్వారా తవ్వుతున్నారు. సరిహద్దు సమస్య తేలితే క్వాలిటీ ఇసుక కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ALSO READ : ఏడాదిన్నరలో పది లక్షల ఉద్యోగాలు భర్తీ : కిషన్ రెడ్డి
జాయింట్ సర్వేతోనే సమస్యకు చెక్..
తుంగభద్ర నదిలో సరిహద్దు సమస్యకు ఏపీ, తెలంగాణ ఆఫీసర్ల జాయింట్ సర్వే తోనే చెక్ పడనుంది. ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడంతో సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. గద్వాల, కర్నూల్ కలెక్టర్లు చర్చించి జాయింట్ సర్వే చేపట్టి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
హద్దులు ఏర్పాటు చేస్తాం..
తుంగభద్ర నదిలో పట్టా భూముల ఆధారంగా సరిహద్దులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జాయింట్ సర్వే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే జాయింట్ సర్వే చేసి సరిహద్దు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం.- లక్ష్మీనారాయణ, అడిషనల్ కలెక్టర్