
ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఇందులో 138 మంది ఎమ్మెల్యేలపై (79 శాతం) క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక తేల్చింది. ఇందులో తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న శాసనసభ్యులు 98 (56 శాతం) మంది. అధికార టీడీపీలో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్నారు.
ప్రస్తుతం ఉన్న134 మంది టీడీపీ ఎమ్మెల్యేలలో 115 మంది తమ పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. తద్వారా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా ఏపీ తొలి స్థానంలో నిలిచింది. 69 శాతంతో తెలంగాణ, కేరళ సంయుక్తంగా తర్వాత స్థానంలో ఉన్నాయి. తర్వాత స్థానాల్లో బీహార్ (66 శాతం), మహారాష్ట్ర (65 శాతం), తమిళనాడు (59 శాతం) రాష్ట్రాలు నిలిచాయి.
కాగా, దేశంలోని 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలోని 4,123 మంది ఎమ్మెల్యేలలో 4,092 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను ఎన్నికల హక్కుల సంస్థ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషించింది. సరిగ్గా స్కాన్ చేయకపోవడంతో మిగిలిన 24 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లను పరిశీలించలేకపోయింది. వివిధ కారణాల వల్ల మరో ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీలు ఉన్నాయి.
ALSO READ | హైకోర్టునే తప్పుదోవ పట్టించినందుకు కోటి రూపాయల ఫైన్ విధించిన జడ్జి
ఈ క్రమంలో ఏడీఆర్ విశ్లేషణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని మొత్తం 4,092 మంది ఎమ్మెల్యేలలో కనీసం 45 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక ద్వారా స్పష్టం చేసింది. 1,861 మంది ఎమ్మెల్యేలు తమ పేర్లపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈసీకి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. వీరిలో 1,205 (29 శాతం) మంది ఎమ్మెల్యేలు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు సహా తీవ్రమైన క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారని ఏడీఆర్ రిపోర్టు పేర్కొంది.