
శ్రీకాళహస్తి : పోలీసులు పప్పులో కాలేశారు. కారుకు నో హెల్మెట్ జరిమానా వేశారు. తర్వాత తప్పుదిద్దుకున్న పోలీసులు..ఇందుకు సంబంధించిన వివరాలను వెబ్ సైట్ నుంచి తొలగించారు. అప్పటికే స్క్రీన్ షాట్ల రూపంలో ఈ ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ సంఘటన ఏపీలోని శ్రీకాళహస్తిలో గురువారం జరిగింది. నో హెల్మెట్ పేరుతో యజమానికి ఈ చెలాన్ పంపించారు. ఈ నేరానికి గానూ మోటార్ వెహికల్ చట్టం1988 ప్రకారం 135 రూపాయలు అపరాధం చెల్లించాలంటూ.. ఓ కారు యజమానికి ఈ-చెలాన్ పంపించారు. గురువారం రాత్రి 7.24 గంటలకు తన మొబైల్ కి వచ్చిన ఈ- చెలాన్ చూసి తిరుపతిలో ఉన్న యజమాని షాక్ అయ్యాడు.
AP 03 BZ 7345 అనే నంబరు గల వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిందని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు ఈ అపరాధం అనీ అందులో తెలిపారు.
శ్రీకాళహస్తి పానగల్ దగ్గర గురువారం రాత్రి 7.24 గంటల ప్రాంతంలో ఈ ఉల్లంఘన జరిగిందని ఉంది. మార్చి 1వ తేదీ లోగా చలాన్ చెల్లించాలని ఆదేశించారు. ఇంతకీ ఈ-చలాన్ లో ఉన్న నెంబరు గల వాహనం బైక్ కాదు, కారు. పైగా వాహనం గురువారం తిరుపతి దాటి ప్రయాణించనే లేదు. ఇదెక్కడి నేరంరా బాబూ అని వాహన యజమాని తల పట్టుకున్నాడు. టెక్నాలజీ అద్భుతమే గానీ, పొరపాటు జరిగితే కొత్త చిక్కులే సృష్టిస్తుందని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఈ- చేలాన రాసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు కారు యజమాని. అయితే ఇందుకు సంబంధించిన చలాన్ ఫొటోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో..ఈ విషయం పోలీసులకు చేరింది. వెంటనే అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ చలాన్ వివరాలను డిలేట్ చేసి, తప్పును దిద్దుకున్నారు అధికారులు.