దేవుడా: అప్పుడే మండుతున్న ఎండలు.. పోను పోను ఎలా ఉంటుందో..

దేవుడా: అప్పుడే మండుతున్న ఎండలు.. పోను పోను ఎలా ఉంటుందో..

ఫిబ్రవరి వచ్చేసింది.. చలి తగ్గుముఖం పట్టింది.. కూల్ వెదర్ ని ఎంజాయ్ చేద్దామనుకున్న జనాలకు సూర్యుడు అప్పుడే చుక్కలు చూపిస్తున్నాడు. ఉదయం, సాయంకాలం సమయంలో చలి వాతావరణం ఉంటున్నప్పటికీ పగటి పుట ఉష్ణోగ్రతలు మాత్రం వేసవిని తలపిస్తున్నాయి.. గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఒకపక్క ఎండలు మరోపక్క ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీలోని నందిగామలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదయ్యింది. ఇక విశాఖపట్నం, కళింగపట్నం, శ్రీకాకుళం వంటి చోట్ల సగటున 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలుస్తోంది.

జనవరి నెల ఆఖరి వారం నుంచే మార్చి నేలను తలపించేలా ఎండలు కాస్తుండటంతో  అప్పుడే వేసవి వచ్చిందా అంటూ జనం అవాక్కవుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలను చూసి. ఇప్పుడే ఇలా ఉంటే.. పోను పోను పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు జనం.

తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో అప్పుడే  34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్  అత్యధికంగాలో 37 డిగ్రీలు, భద్రాచలంలో 36 డిగ్రీలు, నిజామాబాద్ లో 36 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మార్చి నెలలో వడగాలులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్న క్రమంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు.