అమెరికాలో కాల్పులు..ఏపీ వ్యక్తి మృతి

  •    8 నెలల కిందే ఉపాధి కోసం అర్కాన్సాస్​కు వెళ్లిన గోపీకృష్ణ
  •     దుండగుడి కాల్పులకు మరో ఇద్దరు అమెరికన్లు బలి
  •     పట్టుకునేందుకు యత్నించిన పోలీసులకు బుల్లెట్ గాయాలు
  •     ఎదురుకాల్పులు జరిపి షూటర్​ను పట్టుకున్న పోలీసులు

వాషింగ్టన్: అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పులకు తెలుగు యువకుడు బలయ్యాడు. మృతుడు ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణగా అధికారులు గుర్తించారు. శనివారం అర్కాన్సాస్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు వైరల్ అయ్యాయి.

రైఫిల్​తో వచ్చి ఫైరింగ్.. 

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ(32) ఎనిమిది నెలల కింద ఉపాధికోసం అమెరికాకు వెళ్లాడు. అర్కాన్సాస్​రాష్ట్రం ఫోర్డైస్ అనే టౌన్​లోని ఓ సూపర్ మార్కెట్​లో పనిచేస్తున్నాడు. శనివారం ఎప్పటిలాగా డ్యూటీకి వచ్చి బిల్లింగ్ కౌంటర్​లో ఉన్న గోపీకృష్ణపై.. ఓ దుండగుడు నేరుగా వచ్చి రైఫిల్​తో కాల్పులు జరిపాడు. ఆపై సూపర్ మార్కెట్​లోని ఓ వస్తువు పట్టుకుని బయటపడ్డాడు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలిన గోపీకృష్ణను సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ అతను ఆదివారం ప్రాణాలు కోల్పోయాడు. గోపీకృష్ణకు భార్య, కొడుకు ఉన్నారు.

ఇంకో ఇద్దరు అమెరికన్లను చంపేసిండు

దుండగుడు వెళ్తూ పార్కింగ్ ప్లేస్​లో ఉన్నవాళ్లపైనా ఫైరింగ్ చేశాడు. దీంతో ఇద్దరు అమెరికన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్​కు చేరుకోగా వారిపైనా నిందితుడు కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్నారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడికీ బులెట్ తగిలిందని, అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు.

దుండగుడి ఫైరింగ్​లో పార్కింగ్ ​ప్లేస్​లో ఉన్న ఎనిమిది మందితోపాటు ఇద్దరు పోలీసులకూ బులెట్ ​గాయాలయ్యాయని చెప్పారు. వాళ్లంతా ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ పొందుతున్నారని, ప్రాణాపాయంలేదని అధికారులు వెల్లడించారు.