
- 6,85,082 మంది స్టూడెంట్స్
- ఇప్పటి వరకు 4,54,669 అపార్ ఐడీ జనరేట్
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న ప్రతి స్టూడెంట్కుఆధార్ తరహాలో ఒక గుర్తింపు సంఖ్య ఇచ్చి వారు భవిష్యత్‌లో ఏ రాష్ట్రంలో చదివినా సులభంగా వివరాలు తెలుసుకునేలా అపార్(ఆటోమేటిక్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజస్ట్రీ) కార్డులు జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారు. స్టూడెంట్పేరు, పుట్టిన తేదీ, ఇంటి పేరు, ఏ తరగతి, ఎక్కడ చదువుకున్నాడు తదితర అన్ని వివరాలు, ఫొటో ఒకే చోట నిక్షిప్తం చేసి, ఆధార్ కార్డు తరహాలో 12 సంఖ్యలతో అపార్ ఐడీ జెనరేట్ చేస్తున్నారు. స్కాన్ చేసి వివరాలు తెలుసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ కార్డుపై ముద్రిస్తున్నారు. దీని ఆధారంగా స్టూడెంట్‌కి సంబంధించిన అన్ని వివరాలు సులువుగా తెలుసుకునే వీలుంటుంది.
అన్ని స్కూళ్లలో
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్, కేజీబీవీ, మోడల్, ఆశ్రమ, మహాత్మా జ్యోతిబా పూలే, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రైవేట్ స్కూళ్లు అన్ని కలిపి 4,314 ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 6,85,082 మంది స్టూడెంట్స్చదువుతున్నారు. ఇప్పటి వరకు 4,54, 669 మంది స్టూడెంట్స్‌కు అపార్ ఐడీ జెనరేట్ అయింది. వివిధ కారణాలతో ఇంకా 2,26,797 మంది స్టూడెంట్స్దరఖాస్తు చేయలేదు. సిద్దిపేట జిల్లాలో అపార్ ఎంట్రీ 75 శాతం పూర్తికాగా మెదక్ జిల్లాలో 62.27 శాతం, సంగారెడ్డి జిల్లాలో 61.8 శాతం అపార్ఎంట్రీ పూర్తయింది.
తేడాలతో ఇబ్బంది
కొందరి స్టూడెంట్స్పేర్లు, ఇంటి పేరు, అడ్రస్ వంటివి ఆధార్ లో ఒకలా, స్కూల్ రికార్డుల్లో మరోలా ఉండడంతో అపార్ ఐడీ జెనరేట్ కావడం లేదు. అలాంటి వారు ఆధార్ కార్డులో మార్పు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఆధార్ కరెక్షన్ కోసం మీ సేవా సెంటర్లు, బ్యాంకులు, పోస్టాఫీస్ లలో కొన్ని చోట్ల మాత్రమే అవకాశం ఉండడంతో అక్కడ రద్దీ, సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యమవుతోంది.