
జనగామ అర్బన్, వెలుగు: విద్యార్థులు చదువుతోపాటు కళల్లోనూ రాణించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి యువజనోత్సవాలు స్థానిక జూబ్లీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యువ కళాకారుల ఎంపిక కార్యక్రమానికి కలెక్టర్హాజరై ఇక్కడ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం పొందిన వారిని రాష్ట్ర స్థాయికి పంపించి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కళాకారులను జనవరి 12 నుంచి 16 వ తేదీ వరకు జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొనడానికి పంపించనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి, అభినందించారు. అనంతరం కలెక్టరేట్ లో నిర్వహించిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చర్యలకు సంబంధించి 10 రోజుల్లో నివేదికను అందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్టీవో, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.అదేవిధంగా వ్యవసాయ, మార్కెటింగ్అధికారులు, మిల్లర్లతో కలిసి కలెక్టరేట్లో కలెక్టర్రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం పంట కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరగాలని, సంబంధిత అధికారులందరు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మొత్తం 2,05,109 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అంచనా ఉన్నందున ఇందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు.