చెప్పేది ఎక్కువ ఇచ్చేది తక్కువ.. జిల్లాలో జాడలేని పంట రుణ ప్రణాళిక

  • గతేడాది ప్రకటించింది రూ. 2,477కోట్లు
  • క్రాప్​లోన్లు ఇచ్చింది మాత్రం రూ.1,354 కోట్లే
  • రుణమాఫీ స్కీం అమలు అంతంత మాత్రమే
  • సీజన్ మొదలైనా ఊసేలేదంటున్న రైతులు
  • వడ్డీ వ్యాపారులే దిక్కు అని ఆవేదన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రైతుల విషయంలో ‘సర్కారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటి’ అన్నట్లుంది. ప్రస్తుతం ఖరీఫ్(వానాకాలం) సీజన్​ మొదలైనా జిల్లాలో వార్షిక పంట రుణ ప్రణాళికను మాత్రం ప్రకటించలేదు. అటు సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు క్రాప్​లోన్లు అందకుండాపోతున్నాయి. గతేడాది నిర్దేశించిన క్రాప్​లోన్ల లక్ష్యంలో కేవలం 56శాతమే ఇచ్చి బ్యాంకులు చేతులు దులుపుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్, యాసంగి సీజన్​ల రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడంతో రైతులకు వడ్డీ వ్యాపారులే దిక్కవుతున్నారు. అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకుని కష్టాలపాలవుతున్నారు. మరో వైపు 2018 రుణమాఫీ స్కీం అమలు అంతంత మాత్రంగానే ఉంది. 

ఏప్రిల్, మే నెలల్లోనే ఖరారు కావాలి..

ఖరీఫ్​ సీజన్ మొదలై దాదాపు నెల దాటింది. పొలాలను చదును చేసుకోవడం, దుక్కులు దున్నడం వంటి పనులను పూర్తి చేసుకొని రైతులు విత్తనాలను వేస్తున్నారు. జిల్లాలో దాదాపు1.82లక్షల మంది రైతులున్నారు. వానాకాలం సీజన్​లో దాదాపు5.77 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఎకరం వరికి దాదాపు రూ.30 వేల నుంచి రూ.35వేలు, పత్తికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఏప్రిల్, మే నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేయాల్సి ఉన్నా ఆ ఊసే లేకుండా పోయింది. దీంతో బ్యాంకర్లు లోన్లు అందించడం లేదు. రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతేడాది రూ.2,477 కోట్లు క్రాప్​లోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా బ్యాంకర్లు కేవలం రూ.1,354కోట్లు మాత్రమే ఇచ్చారు. నూరుశాతం పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు కలెక్టర్ ​అనుదీప్ ​ఆదేశిస్తున్నా అమలులో మాత్రం అది ‘మూడడుగులు వెనక్కి.. ఒక అడుగు ముందుకు’ అన్నట్టు సాగుతోంది.

ఏండ్లుగా ఎదురుచూపులే...

మరోవైపు 2018 రుణమాఫీ స్కీం(రూ. లక్ష లోపు)లో భాగంగా జిల్లాలో1,38,187 మంది రైతులు అర్హులుగా అగ్రికల్చర్ ఆఫీసర్లు గుర్తించారు. కాగా ఇప్పటి వరకు కేవలం 28,751 మందికి మాత్రమే రుణమాఫీ అమలైంది. ఆ ఆశతోనే రైతులు రూ. లక్ష లోపు రుణాలను రెన్యూవల్​ చేయించుకోలేదు. తీసుకున్న లోన్లకు రెన్యూవల్ చేసుకోకనే కొత్త లోన్లు మంజూరు చేయలేమని బ్యాంకర్లు చెబుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా రుణమాఫీ స్కీం అమలు కాక రైతులు ఆర్థికంగా తీవ్రంగా చితికిపోతున్నారు. దీంతో అధిక వడ్డీలకు పెట్టుబడిదారులు, వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయిస్తూ అప్పుల పాలవుతున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సీజన్ తర్వాత క్రాప్​లోన్లు ఇచ్చి ఉపయోగం ఉండదని వారు అంటున్నారు. మరోవైపు అగ్రి ఇన్ ఫ్రా స్కీం జిల్లాలో జాడలేకుండా పోయింది.  కలెక్టర్ స్పందించి వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసి వందశాతం క్రాప్​లోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 

రుణమాఫీ చేయనందునే..

రూ.లక్ష లోపు రుణ మాఫీ చేస్తామని సర్కారు ఎప్పుడో చెప్పింది. ఏండ్లు గడుస్తున్నా అమలు కాలే. బ్యాంకులకు పోతే పాతవి కట్టుండి, కొత్తవి ఇస్తమంటున్నరు. పైసా లేక కొత్త అప్పులు చేయక తప్పుత లేదు. ప్రభుత్వం చేసే పనులతో మేం అప్పుల కోసం ప్రైవేటోళ్ల వద్దకు పోవాల్సి వస్తోంది. సర్కారేమో ఆదుకుంటలేదు. బాకీలు తీర్వక నష్టపోతున్నం.  

–బి. వెంకటేశ్వర్లు, రైతు, టేకులపల్లి మండలం

కొత్త లోన్లు ఇస్తలే.. అప్పే దిక్కు...

ఏప్రిల్, మే నెలల్లో రుణ ప్రణాళికను ఆఫీసర్లు ఖరారు చేసి జూన్​నుంచి లోన్లు ఇస్తే బాగుంటుంది. సీజన్​మొదలై ఇప్పటికే నెల దాటింది. కొత్త లోన్లు ఎప్పుడిస్తరు. రూ.లక్ష లోపు రుణ మాఫీ అవుతుందనే ఆశతో రెన్యూవల్​చేయించలేదు. అది చేయకనే బ్యాంకులో కొత్త లోన్లు ఇస్తలేరు. ఇక అప్పు చేయాల్సిందే. 

–ఎన్. ప్రభాకర్, రైతు, చండ్రుగొండ