- ఆ ప్రాంతాలపై సరిగా ఫోకస్చేయని హెల్త్స్టాఫ్
- కొన్నిచోట్ల రానివ్వని రెసిడెన్షియల్ కమిటీలు
- సింప్టమ్స్ఉన్న వ్యక్తులు తెలియక వైరస్ స్పీడ్‌గా స్ప్రెడ్
సుచిత్ర సర్కిల్ లోని ప్రధాన గేటెడ్ కమ్యూనిటీల్లో అదొకటి. దాదాపు300 ఫ్యామిలీలు ఉంటాయి. ఆ ప్రాంతం లో ఫస్ట్, సెకండ్ వేవ్ ల్లో భారీగా కరోనా కేసులు వచ్చాయి. థర్డ్‌వేవ్‌లోనూ కరోనా బారిన పడుతుండగా ఇప్పటికే జనాల రాకపోకలపై కమిటీ ఆంక్షలు పెట్టింది. దీంతో అపార్ట్మెంట్లలో ఎంతమందికి కరోనా సోకిందనే దానిపై అధికారులు ఫోకస్ చేయడంలేదు.’’
విద్యానగర్ లోని నాగమయ్యకుంట ఏరియాలో 80 ఫ్యామిలీలు ఉండే అపార్ట్మెంట్ అది. గతేడాది కాలంగా అందులో ఎవరో ఒకరు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. అక్కడ ఇప్పటికి ఒక్కసారి కూడా ఫీవర్ సర్వే చేయలేదు. ఇటీవల సర్వే కోసమని వెళ్లి వివరాలు తీసుకోకుండానే వెళ్లిపోయారని అపార్ట్‌మెంట్‌వాసులు చెప్పారు.’’
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్లో ఫీవర్ సర్వే నామ్‌కే వాస్తేగా సాగుతోంది. ఇంటింటికి వెళ్తున్నామని చెబుతున్నా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్లల్లోకి హెల్త్ స్టాఫ్ వెళ్లట్లేదు. దీంతో అవి కరోనాకు హాట్ స్పాట్లుగా ఉన్నాయి. గ్రేటర్లో మొత్తం ఇండ్లలో నాలుగున్నర లక్షల వరకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్లు ఉండగా, ఇందులో మెజార్టీ జనాలు ఉంటున్నారు. ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నవారు చాలామంది సొంత వైద్యం చేసుకుంటూ టెస్టులపై ఇంట్రెస్ట్ చూపడంలేదు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నా కూడా మెడికల్‌షాపుల నుంచి తెచ్చుకుని వాడుతున్నారు. దీంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకే కాకుండా, ఇరుగు పొరుగు వారికి కూడా వైరస్సోకుతుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించేలా సింప్టమ్స్ఉన్నవారిని టెస్ట్‌లు చేసి లక్షణాలు ఉంటే మందుల పంపిణీ చేయాల్సి ఉండగా, హెల్త్ సిబ్బంది వెళ్లకపోతుండగా సమయానికి వైద్య సేవలు పొందడంలేదు. 4 రోజులుగా ఫీవర్ సర్వే కొనసాగుతుండగా ఇప్పటివరకు 1.70 లక్షల ఇండ్లను సర్వే చేసినట్లు అధికారులు చెప్పారు. సిటీలో మొత్తం16 లక్షల ఇండ్లు ఉన్నట్లు బల్దియా లెక్కలు చెప్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ సర్వే స్లో గా సాగుతోంది. గతేడాది ఫీవర్ సర్వే అప్పుడు కూడా సిటీలో బస్తీలు, కాలనీల్లోని ఇండిపెండెంట్ ఇండ్లకే హెల్త్ సిబ్బంది వెళ్లారు. అపార్టుమెంట్ల లోకి అడుగు పెట్టలేదు. ఈసారి సర్వే లో కూడా ఇండ్లలోనే తనిఖీలు చేస్తున్నారు.
ఒక్కరు వైరస్‌బారిన పడినా..
ఆశ, ఏఎన్ఎంలతో పాటు బల్దియా ఎంటమాలజీ, హెల్త్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఫ్యామిలీ ఆరోగ్య వివరాలు తీసుకుంటుండగా, అపార్టుమెంట్లలో మాత్రం సాగట్లేదు. దీంతో పదుల సంఖ్యలో కుటుంబాలు ఉండే వాటి నుంచే కరోనా స్పీడ్‌గా వ్యాప్తి చెందుతుంది. నలుగురు, ఐదుగురు ఉండే కుటుంబాల్లో ఒక్కరు వైరస్ బారిన పడినా రెండ్రోజుల్లో మిగిలిన వారిలో సింప్టమ్స్బయటపడుతున్నాయి. అపార్టుమెంట్లలో వ్యాప్తి ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉండగా కట్టడి చేయడంలేదు. ఇండిపెండెంట్ ఇండ్లలో మాత్రమే సర్వే చేసి, కిట్లను అందిస్తున్నారు. ఆదివారం అంబర్ పేట్ డివిజన్ పరిధిలో సర్వే చేయగా 75 ఇండ్లలో 3 మాత్రమే అపార్టుమెంట్లని తెలిసింది. టెస్టులు, మెడికేషన్ పై నిర్లక్ష్యంగా ఉంటే ఇతరులకు సోకుతుందని మరోవైపు డాక్టర్లు పేర్కొంటున్నారు.
గత సర్వే తీరుగానే..
గతేడాది చేసిన ఫీవర్ సర్వే తీరుగానే ఇదే సీన్ రిపీట్అవుతుంది. ఈసారి కూడా నామ్‌కే వాస్తేగా చేస్తూ, రోజువారీ కిట్ల పంపిణీపైనే ఫోకస్ పెట్టారు. ఒక ఫ్యామిలీలో ఎంతమందికి కరోనా సింప్టమ్స్ఉన్నాయనే వివరాలు పక్కాగా సేకరించడం లేదు. ఫ్లాట్లలో ఉండే వారికి కరోనా సోకితే ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయట్లేదు. ఒక్కసారి కిట్లను పంపిణీ చేసి వెళ్తుండగా, ఆ తర్వాత జనాలు బయట తిరుగుతున్నారు.
వచ్చినా చెప్పట్లేదు
గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే కాలనీలు, శివారు ప్రాంతాల్లోనైతే సర్వే స్లోగా సాగుతోంది. మేడ్చల్ జిల్లాలోని కొంపల్లి, సుచిత్ర, దుండిగల్ వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు పదుల సంఖ్యలో ఉండగా, ఆయా ప్రాంతాలకు సర్వే సిబ్బంది వెళ్లడంలేదు. దీంతో కరోనా సింప్టమ్స్ఉన్నవారిని గుర్తించడంలో లేట్ అవుతోంది. ఇక సింప్టమ్స్ఉన్నవారిలో కొందరు చెప్పడం లేదు. టెస్టులకు కూడా వెళ్లేందుకు ఇంట్రెస్ట్చూపడంలేదు. రెండు వేవ్ ల్లో పాజిటివ్ వచ్చిన వారి ఇండ్లను కంటైన్ మెంట్ చేశారు. అప్పట్లో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా వారు ప్రస్తుతం వివరాలు ఇచ్చేందుకు ముందుకు రావట్లేదు. కూకట్ పల్లి, చందానగర్, జూబ్లీహిల్స్ వంటి ఏరియాల్లో అపార్టుమెంట్లలోకి హెల్త్ సిబ్బందిని రానిస్తలేరు. దీంతో ఆ ప్రాంతాల్లో ఎంత మందికి కరోనా సోకిందనేది తెలుసుకోలేని పరిస్థితి ఉంది.