భారీ వర్షాలకు, వరదలకు విజయవాడ అతలాకుతలమైన విషయం తెలిసిందే. బుడమేరు వాగుకు వరద నీరు పోటెత్తడంతో పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగాయి. ఆహారం, నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అలానే ఉంది. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ.. వరద ఉద్ధృతి మాత్రం అలానే కొనసాగుతోంది. సాయం కోసం ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సందర్శించారు.
విజయవాడ ముంపు ప్రాంతాన్ని, ప్రకాశం బ్యారేజ్‌లో వరద ప్రవాహాన్ని వైఎస్ షర్మిల గురువారం పరిశీలించారు. ఈ సంధర్భంగా చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సేవలను సమర్థిస్తూనే, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేశారు.
రూ.25 లక్షలు నష్టపరిహారం
కొంప కొల్లేరు అయ్యింది.. బెజవాడ బుడమేరు అయ్యిందన్న షర్మిల, విజయవాడ వరదలకు బుడమేరే కారణమని పేర్కొన్నారు. వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బుడమేరుకి రిటర్నింగ్ వాల్ కట్టాలని సలహా ఇచ్చారు. వరదల్లో ఇప్పటివరకు 35 మంది చనిపోగా.. దాదాపు 5లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఏపీసీసీ చీఫ్ తెలిపారు. వీరిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.25 లక్షలు, నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం రూ.లక్ష సాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
చంద్రబాబుపై ప్రసంశలు
ఆపత్కర పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోన్న సహాయక చర్యల పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. విపత్తుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు అభినందననీయని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో బుడమేరు సమస్యను పరిష్కరించడానికి ఆపరేషన్ కొల్లేరు, బుడమేరు డైవర్షన్ స్కీమ్‌కి రూపకల్పన చేశారని వివరించారు. బుడమేరు పరిసరాల్లో ఆక్రమణల వల్లే ఈ విపత్తు సంభవించిందని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా(HYDRA) తరహాలో రాపిడ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్రమణలు తొలగించాలని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.