ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నాడని ఒకర్ని.. డబ్బుల కోసం మరొకర్ని చంపిన్రు!

ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నాడని ఒకర్ని.. డబ్బుల కోసం మరొకర్ని చంపిన్రు!
  • ఎల్‌బీనగర్‌, వరంగల్‌లో జరిగిన మర్డర్‌ కేసులను ఛేదించిన పోలీసులు
  • వరంగల్‌లో ఈ నెల 2న హత్యకు గురైన రిటైర్డ్‌ మేనేజర్‌
  • పెండ్లి చేసుకునేందుకు అమ్మాయిని చూపిస్తానంటూ పరిచయం చేసుకున్న నిందితుడు
  • రూ. 5 లక్షలు ఇవ్వకపోవడంతో మందు పార్టీ ఇస్తానని పిలిచి మర్డర్‌

వరంగల్‍, వెలుగు : వరంగల్‌ నగరంలో ఈ నెల 3న వెలుగు చూసిన ఏపీజీవీబీ రిటైర్డ్‌ మేనేజర్‌ వెలిగేటి రాజమోహన్‌ మర్డర్‌ మిస్టరీని పోలీసులు ఛేదించారు. డబ్బులు, బంగారం కోసమే హత్య జరిగినట్లు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌ ఏసీపీ నందిరాంనాయక్‌ శనివారం వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కోమటిపల్లికి చెందిన జక్కుల శ్రీనివాసరావు హనుమకొండ కలెక్టరేట్‌ పక్కన ఉన్న రెవెన్యూ కాలనీలో ఉంటున్నాడు. గతంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో పనిచేసిన ఆయన ప్రస్తుతం పీఎం యోజన స్కీంలో  కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు.

శ్రీనివాసరావుకు రెండు నెలల కింద ఓ  ఫోన్‌ దొరకగా, అందులో ఉన్న నంబర్‌ ద్వారా రాజమోహన్‌ పరిచయం అయ్యాడు. ఇద్దరి మధ్య మాటల సందర్భంలో ‘నేను రిటైర్డ్‌ మేనేజర్‌ని, భార్య చనిపోవడం, ఇద్దరు కూతుర్లు అందుబాటులో లేకపోవడంతో ఒంటరి జీవితం గడుపుతున్నా’ అని రాజమోహన్‌ శ్రీనివాసరావుకు చెప్పాడు. దీంతో శ్రీనివాసరావు తాను పెండ్లిళ్ల మీడియేటర్‌నని, ఎలక్ట్రానిక్‌ మీడియా రిపోర్టర్‌ను అంటూ నమ్మబలికాడు. రాజమోహన్‌ పెండ్లి చేసుకునేందుకు అమ్మాయిని చూస్తానని చెప్పడంతో ఇద్దరు క్లోజ్‌ అయ్యారు. ఈ క్రమంలో తాను చేయబోయే ఓ బిజినెస్‌కు రూ. 5 లక్షల అప్పు కావాలని రాజమోహన్‌ను అడిగాడు.

అయితే ప్రస్తుతం తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో అతడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు కాజేయాలని ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగా పార్టీ అరేంజ్‌ చేశానంటూ చెప్పి రాజమోహన్‌ను ఈ నెల 2న రాత్రి 9.30 గంటలకు రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్‌లోని తాను ఉంటున్న ఇంటికి తీసుకెళ్లాడు. అతడికి ఫుల్‌గా లిక్కర్‌ తాగించిన అనంతరం కాళ్లు, చేతులు కట్టేసి, ముఖం చుట్టూ టవల్‌ చుట్టి రోకలిబండతో కొట్టాడు. తర్వాత గొంతు పిసికి చంపేశాడు. అప్పటికీ కాళ్లు కదులుతుండడంతో కుక్కకు సంబంధించిన గొలుసుతో కట్టేసి తాళం వేశాడు.

రాజమోహన్‌ ఒంటిపై ఉన్న బ్రాస్‌లెట్‌, చైన్‍, మూడు రింగులను తీసుకున్నాడు. తర్వాత డెడ్‌బాడీని ఓ గోనెసంచిలో కట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారులో వేశాడు. తర్వాత రెడ్డిపురం చెరువు వైపు వెళ్లగా అక్కడ జనసంచారం ఉండడంతో పక్కనే ఉన్న కెనాల్‌లో పడేసేందుకు ప్రయత్నించాడు. అక్కడ నీరు లేకపోవడంతో అక్కడి నుంచి ములుగు రోడ్డు మీదుగా భద్రకాళి గుడి చెరువు వద్దకు వచ్చాడు. అందులో కూడా నీరు లేకపోవడం, అప్పటికే తెల్లవారుతుండడంతో కేఎంసీ ఎదురుగా ఉన్న రంగంపేట వద్ద రోడ్డుపై కారుని నిలిపేసి ఆటోలో వెళ్లిపోయాడు. తర్వాత ఎలాంటి ఆధారాలు దొరకకుండా రక్తపు మరకలు తుడిచి వేసి, దుస్తులను బయట పడేశాడు. 3న ఉదయం రాజమోహన్‌రెడ్డి డెడ్‌బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో నిందితులను పట్టుకునేందుకు సీపీ అంబర్‌ కిశోర్‌ ఝూ డీసీపీ షేక్‍ సలీమా, వరంగల్‍ ఏసీపీ నందిరాంనాయక్‌ నేతృత్వంలో నాలుగు టీంలను ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు రంగంపేటలో నిందితుడు ఎక్కిన ఆటోను గుర్తించి డ్రైవర్‌తో మాట్లాడారు. అతడు ఇచ్చిన వివరాలతో వరంగల్‌ నగరంలోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడి నుంచి బంగారు అభరణాలు, హత్యకు ఉపయోగించి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మట్వాడా సీఐ తుమ్మ గోపి, ఎస్సై విఠల్‌, నవీన్‍, సాంబయ్య, లచ్చయ్య, క్రై పార్టీ సిబ్బందిని సీపీ అభినందించారు.  


ఎక్కువ వడ్డీ తీసుకుంటున్నాడని..

ఎల్‌బీనగర్, వెలుగు: హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అరుణోదయ నగర్‌లో నాలుగు రోజుల కింద జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం నలుగురు వ్యక్తులు కలిసి హత్య చేసినప్పటికీ ఒక్కరే లొంగిపోవాలని, మిగతా ముగ్గురు అతడికి బెయిల్‌ ఇప్పించడంతో పాటు, కేసు కాంప్రమైజ్‌ అయ్యేలా చూడాలని ప్లాన్‌ చేసుకున్నారు. కానీ పోలీసులు పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేయడంతో వారి ప్లాన్‌ బెడిసికొట్టి మొత్తం నలుగురు పోలీసులకు చిక్కారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్గొండ జిల్లా అంతమ్మగూడెంకు చెందిన ఐతరాజు శంకర్, గట్టుప్పల్‌కు చెందిన పెద్దగోని శేఖర్‌, పెద్దగోని సాయి, హయత్‌నగర్‌ హన్మగల్‌కు చెందిన భవనసాయి ప్రసన్నకుమార్‌.. అరుణోదయ కాలనీకి చెందిన కాశీరావు వద్ద పనిచేస్తూ అతడి ఇంటి పైపోర్షన్‌లో ఉంటారు. వీరు నలుగురు కాశీరావు వద్ద రూ. లక్షన్నర నుంచి రూ. 6 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. ఈ డబ్బులకు 30 శాతం వడ్డీ వసూలు చేస్తుండడంతో దానిని కట్టలేక కాశీరావును హత్య చేసేందుకు ప్లాన్‌ చేశారు.

ఇందులో భాగంగా ఈ నెల 3న కాశీరావును తమ పోర్షన్‌కు పిలిపించారు. అతడితో మాట్లాడుతూనే కళ్లపై పెప్పర్‌ స్ర్పే చల్లారు. తర్వాత శేఖర్‌, సాయి, ప్రసన్నకుమార్‌ కాశీరావును కదలకుండా పట్టుకోగా శంకర్‌ సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసి హత్య చేశాడు. డెడ్‌బాడీని అక్కడే వదిలేసి ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం శేఖర్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా హత్యలో ఎంత మంది పాల్గొన్నారు ? అసలు సూత్రధారులు ఎవరన్న విషయాన్ని శేఖర్‌ చెప్పాడు. దీంతో పోలీసులు నలుగురిని అరెస్ట్‌ చేసి, వారి నుంచి రెండు సర్జికల్‌ బ్లేడ్లు, యాక్టివా బైక్‌, కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు.