హైదరాబాద్, వెలుగు: అపోలో హాస్పిటల్స్‌కు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో రూ.395.7 కోట్ల నికర లాభం (స్టాండ్‌ఎలోన్) వచ్చింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.249 కోట్లతో పోలిస్తే ఇది 59 శాతం ఎక్కువ. కంపెనీ రెవెన్యూ రూ. 4,847 కోట్ల నుంచి 15.3 శాతం వృద్ధి చెంది రూ.5,589.3 కోట్లకు చేరుకుంది. ఇబిటా (ట్యాక్స్‌లు, వడ్డీలకు ముందు
ప్రాఫిట్) 30 శాతం పెరిగి క్యూ2 లో రూ.815.5 కోట్లకు చేరుకోగా, ఇబిటా మార్జిన్ 14.6 శాతానికి మెరుగుపడింది.
అపోలో హాస్పిటల్స్‌కు హెల్త్‌కేర్ సెగ్మెంట్ నుంచి రూ.2,903 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన 14 శాతం గ్రోత్‌కు సమానం. ఇబిటా రూ.722 కోట్లకు, నెట్ ప్రాఫిట్ రూ.364 కోట్లకు పెరిగాయి. అపోలో హెల్త్ అండ్ లైఫ్‌స్టైల్ సెగ్మెంట్ క్యూ2లో రూ.404 కోట్ల రెవెన్యూ సాధించగా, రూ.46 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఫార్మసీ, డిస్ట్రిబ్యూషన్‌పై ఫోకస్ పెట్టే అపోలో హెల్త్‌కో క్యూ2లో రూ.2,282 కోట్ల రెవెన్యూ సాధించింది.