- ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్‌సిటీ, వెలుగు: చేవెళ్ల ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు అభివృద్ధి పనులు త్వరలో స్టార్ట్అవుతాయని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన బంజారాహిల్స్ లోని తన ఆఫీసులో ఎన్ హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు, ఆర్అండ్బీ ఈఈ ధర్మారెడ్డి, ఇతర ఎన్హెచ్ఏఐ అధికారులు, చేవెళ్ల బీజేపీ నాయకులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు పెండింగ్పడిన బీజాపూర్ నేషనల్హైవే పనుల పురోగతిని తెలుసుకున్నారు.
పనుల్లో జాప్యానికి కారణాలను ఆరా తీశారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడాలని అధికారులకు సూచించారు. రెండు వారాల్లో పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్రత్నం, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, కొండా రాందేవ్ రెడ్డి, మల్గారి రమణారెడ్డి, టీఏసీ కమిటీ మెంబర్ మాణిక్యరెడ్డి, జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, షాబాద్ మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, నాయకులు వైభవ్ రెడ్డి,నాగరాజు,రాజీవ్ రెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.