బీఆర్ఎస్ లోకి అప్పాల గణేశ్ : ఆహ్వానించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 

నిర్మల్, వెలుగు : నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అప్పాల గణేశ్ చక్రవర్తి బుధవారం బీఆర్ఎస్​లో చేరారు. స్థానిక దివ్య గార్డెన్​లో జరిగిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గణేశ్​కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ  కౌన్సిలర్లు, మైనార్టీ నాయకులు గులాబీ పార్టీలో చేరారు. దీనికి ముందు దాదాపు 5వేల మందితో అప్పాల గణేశ్ నిర్మల్​లో బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ దివ్య గార్డెన్ వరకు కొనసాగింది. కాగా ఈ  సందర్భంగా ఇంద్రకరణ్ ​రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పట్ల అన్ని పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుపొంది అధికారం చేపట్టబోతోందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్​పర్సన్ విజయలక్ష్మి, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ విఠల్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, గ్రంథాలయ  సంస్థ  చైర్మన్ రాజేందర్, ఎఫ్ఎస్​సీఎస్ చైర్మన్ రాజేందర్ తదితరులుపాల్గొన్నారు.