మహబూబ్ నగర్, వెలుగు: వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి అప్పన్నపల్లి –2 నిర్మాణ పనులు పూర్తి చేసి, ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అప్పన్నపల్లి వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో ఈ రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగేదని, ఇప్పుడు హైదరాబాద్ కు గంటలో చేరుకునేలా అవకాశం కల్పించామన్నారు. 2వ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ఫోర్లైన్హైవే అవుతుందన్నారు.
సైబర్ నేరాలపై ఫోకస్ పెట్టాలి
మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: సైబర్ నేరాలపై ఫోకస్ పెట్టాలని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీస్ ఆఫీసర్లతో శాంతిభద్రతలపై సమీక్షించారు. గ్రామాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ పరిచయం లేని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయొద్దని ప్రచారం చేయాలన్నారు. పెండింగ్కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఏర్పాటు చేయించాలన్నారు. ఏఎస్పీ రాములు, డీఎస్పీలు మహేశ్, రమణారెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
హక్కులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది
బాలల హక్కులను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో చైల్డ్ లైన్ దోస్తీ వారోత్సవాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. పేరెంట్తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలన్నారు.
ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యం
పెబ్బేరు/ శ్రీరంగాపూర్: ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సి. నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన వనపర్తి జిల్లాలోని పాన్ గల్, శ్రీరంగాపూర్, పెబ్బేరు మండలాల్లో పర్యటించారు. పెబ్బేరు పట్టణంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో 2 వేల టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రంగ సముద్రంలో రొయ్యపిల్లలను విడుదల చేశారు. ఇటీవల రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన ఆంధ్రప్రభ విలేకరి శ్రీనివాసులు ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కులవృత్తులకు ఊపిరి పోసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎండిపోయి మత్స్యకారులు వలసపోయారని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు నింపామని గుర్తు చేశారు. సబ్సిడీ గొర్రె పిల్లలతో గొల్ల కురుమలకు ఆర్థిక స్థిరత్వం ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు పేర్లు మార్చి తెలంగాణ పథకాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. జడ్పీ చైర్మన్లోక్ నాథ్ రెడ్డి, ఎంపీపీ గాయత్రి పృథ్వీరాజ్, జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, జిల్లా ఫిషరీస్ఆఫీసర్రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
పరిహారం పంపిణీలో ఆలస్యం చేయొద్దు
నారాయణపేట, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ల్లో బాధితులకు పరిహారం వెంటనే అందజేయాలని విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన 2 హత్య కేసులు, 15 అత్యాచారం కేసులపై ఆయా శాఖలు తీసుకున్న చర్యలను కేసుల వారీగా చర్చించారు. 2019 – 2022 వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మొత్తం116 నమోదు కాగా వీటిలో 36 కేసులకు ఎఫ్ఐఆర్స్టేజీలో నష్టపరిహారంగా రూ. 86,70,000 ఇచ్చామన్నారు. పెండింగ్ లో ఉన్న కేసుల చార్జిషీట్ త్వరగా వేయాలని పోలీస్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ మీటింగ్‌లో జిల్లా అధికారులు కన్యాకుమారి, చత్రు నాయక్, మురళి, జాన్ సుధాకర్, హరనాథ్ రెడ్డి, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్‌లో పీఈటీకి గోల్డ్ మెడల్
నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని కొల్లాపూర్ గవర్నమెంట్ స్కూల్ పీఈటీ జయలక్ష్మి ‘ఉమెన్స్ మాస్టర్ అథ్లెటిక్స్ నేషనల్ ఛాంపియన్షిప్– 2022’ లాంగ్ జంప్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామానికి చెందిన జయలక్ష్మి ఇటీవల అస్సాం రాష్ట్రంలోని గుహవాటి లో జరిగిన పోటీల్లో ఈ ఘనత సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలోనూ రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ దక్కించుకుంది. వచ్చే నెలలో హర్యానాలో జరిగే ఆల్ ఇండియా సివిల్ నేషనల్ టోర్నమెంట్‌కు, నేషనల్ వుమెన్స్అథ్లెటిక్స్ లో సెలెక్ట్ అయ్యానని ఐర్లాండ్‌లో నిర్వహించే ఈ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొంటానని ఆమె తెలిపారు. జయలక్ష్మిని కొల్లాపూర్గర్ల్స్హైస్కూల్ టీచర్లు
సన్మానించారు.
బాధితులు సచ్చినంక హామీలు నెరవేర్చుతరా?
బీజేపీ లీడర్ బాలత్రిపుర సుందరి ఫైర్
నవాబుపేట, వెలుగు: టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు రోడ్డు విస్తరణ పేరుతో 110 కుటుంబాలను రోడ్డున పడేశారని, బాధితులు సచ్చినంక వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చుతారా? అని ప్రశ్నించారు. బాధితుల గోడుపై ‘వెలుగు’ లో వచ్చిన కథనానికి ఆమె స్పందించి గురువారం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అధికార పార్టీ లీడర్లు, అధికారులు ఇండ్లు కూల్చడానికి ముందు నెలరోజుల్లోగానే ‘డబుల్’ ఇండ్లు , ప్లాట్లు అంటూ అబద్ధపు హామీలు ఇచ్చి ఆరునెలలు దాటుతున్నా బాధితులను పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పేద ప్రజలను మోసం చేయడం టీఆర్ఎస్ప్రభుత్వానికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సొంత మండలంలో ఈ పరిస్థితి ఉండడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఎంపీ, ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌చేశారు. వారం రోజుల్లో బాధితులకు న్యాయం చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీ మండల నాయకులు యాదయ్య, నర్సంహ, సత్యం, శ్రీను, లింగం, సాయి తదితరులు పాల్గొన్నారు.
చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడొద్దు
పెబ్బేరు, వెలుగు : విద్యార్థులు అనుకున్న లక్ష్యం కోసం ముందుకెళ్లాలని, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడొద్దని వనపర్తి జూనియర్ సివిల్ జడ్జి బి. రవికుమార్ అన్నారు. గురువారం పెబ్బేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరై మాట్లాడారు. మైనర్లు బైకులు నడపవద్దని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. స్టూడెంట్లు చదువుపై ఆసక్తి పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అడ్వకేట్లు ఉత్తరయ్య, కృష్ణయ్య, శ్రీనాథ్, వినోద్, ఎస్సై రామస్వామి పలు చట్టాల గురించి స్టూడెంట్లకు అవగాహన కల్పించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్ రెడ్డి, లెక్చరర్ శ్రీనివాస్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల సమస్యలు సమన్వయంతో పరిష్కరించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : మహిళల సమస్యలు అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్లతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. హాజరైన అడిషనల్కలెక్టర్మాట్లాడుతూ దివ్యాంగులు, గర్భిణులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, అనాథ పిల్లల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న దివ్యాంగుల సంఘం ప్రతినిధులు పలు సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు. దివ్యాంగులందరికీ ఫ్రీ బస్‌పాస్‌లతో పాటు వారి వెంట ఉండే అటెండర్ కు కూడా పాస్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి
నారాయణపేట, వెలుగు: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ పిలుపునిచ్చారు. గురువారం కొడంగల్నియోజకవర్గ కో కన్వీనర్ కోటకొండ రాముతో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని హైకమాండ్కృతనిశ్చయంతో ఉందన్నారు. అందుకోసం క్షేత్రస్థాయి లీడర్లు టీఆర్ఎస్ఎత్తులను ఎప్పటి కప్పుడు చిత్తు చేస్తూ ముందుకు సాగాలన్నారు. టీఆర్ఎస్ దమననీతిని ప్రజల్లో ఎండగట్టాలని, అందుకు అవసరమైన టీం ను సిద్ధం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మదన్, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ నందు నామాజీ పాల్గొన్నారు.